ఆ బాధ్యత మీదే.. ఎంపీలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం | Ys Jagan Meeting With Ysrcp Mps Updates | Sakshi
Sakshi News home page

ఆ బాధ్యత మీదే.. ఎంపీలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం

Jan 22 2026 4:04 PM | Updated on Jan 22 2026 7:11 PM

Ys Jagan Meeting With Ysrcp Mps Updates

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన సమస్యను పార్లమెంట్ ఉభయ సభల్లో సమర్థవంతంగా, ధైర్యంగా లేవనెత్తాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రజల కష్టాలు, సమస్యలు, ఆకాంక్షలను జాతీయ స్థాయిలో వినిపించే బాధ్యత వైఎస్సార్సీపీ ఎంపీలదేనని ఆయన గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి వైఎస్సార్‌సీపీ ఎంపీలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..
ఏపీలో రైతులు, యువత, మహిళలు, కార్మికులు, పేదలు, బడుగు–బలహీన వర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారన్న వైఎస్ జగన్.. ఈ వర్గాలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం, అన్యాయాన్ని పార్లమెంట్ వేదికగా ఎండగట్టాలని ఎంపీలకు సూచించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమలైన అనేక సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయడం, ప్రజల హక్కులను కాలరాస్తున్న తీరును కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీలకు చెప్పారు. దీంతోపాటు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, అప్పులు చేయడంలో యధేచ్ఛగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, దీంతో రాష్ట్రం భయంకరమైన రుణభారంలో కూరుకుపోతుందన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ అమలు చేస్తున్న “రెడ్ బుక్ పాలన” కారణంగా రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు పెరిగిపోయిందని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులపై దాడులు, అక్రమ కేసులు, వేధింపులు కొనసాగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులు కూటమి నాయకులు కాలరాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల వైఎస్సార్సీపీకి చెందిన దళిత కార్యకర్త మందా సల్మాన్‌పై జరిగిన దాడి, హత్య ఘటనను ప్రస్తావించిన వైఎస్‌ జగన్‌.. రాష్ట్రంలో దళితులపై దాడులు, అక్రమ కేసులు, వేధింపులు రోజురోజుకీ పెరుగుతున్నాయని, ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎంపీలు జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్‌ను కలసి సమగ్ర నివేదికతో కూడిన వినతిపత్రం అందజేయాలని వైఎస్ జగన్ సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హత్యలు, వేధింపులపై రాజ్యాంగబద్ధ సంస్థలు తక్షణమే స్పందించి జోక్యం చేసుకోవాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపవద్దని ఎంపీలకు స్పష్టం చేశారు.

పార్లమెంట్‌ను ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఒక శక్తివంతమైన వేదికగా ఉపయోగించాలని, కేంద్రంపై నిరంతర ఒత్తిడి తీసుకువచ్చే విధంగా ఎంపీలు పనిచేయాలని వైఎస్ జగన్ సూచించారు. వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం  అంకితభావంతో పనిచేస్తుందని వైఎస్ జగన్‌ స్పష్టం చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement