కేంద్ర మంత్రివర్గం ఆమోదం.. రూ.27,360 కోట్లతో ‘పీఎం–శ్రీ’

Union Cabinet approves PM-SHRI scheme for school upgradation - Sakshi

ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 14,597 పాఠశాలల అభివృద్ధి 

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎం–శ్రీ) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పీఎం–శ్రీ యోజన, పీఎం గతిశక్తికి సంబంధించిన రైల్వే ల్యాండ్‌ పాలసీ సవరణకు ఆమోదం తెలిపారు. పలు ఇతర కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేరళలో రూ.1,957 కోట్లతో కొచ్చీ మెట్రో రైల్‌ ప్రాజెక్టు రెండో దశకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌లో పరస్పరం సహకరించుకోవడానికి వీలుగా భారత్‌–మాల్దీవుల మధ్య ఇటీవల కుదిరిన అవగాహనా ఒప్పందానికి(ఎంఓయూ) ఆమోదం తెలియజేసింది. విద్యార్థులకు లబ్ధి చేకూరేలా ఒక దేశంలోని కోర్సులు, విద్యార్హతలను మరో దేశం గుర్తించేలా యూకే–భారత్‌ మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని కేబినెట్‌ ఆమోదించింది. పీఎం–శ్రీ కింద ఐదేళ్లలో రూ.27,360 కోట్లతో దేశవ్యాప్తంగా 14,597 పాఠశాలలను పీఎం–శ్రీ స్కూళ్లుగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు.

35 ఏళ్లకు రైల్వే భూముల లీజు  
రైల్వే కొత్త ల్యాండ్‌ పాలసీ ప్రతిపాదనలో కార్గో, పబ్లిక్‌ యుటిలిటీ, రైల్వేల ప్రత్యేక వినియోగాల్లో సవరణలు చేశారు. రైల్వే భూమిని దీర్ఘకాలిక లీజుకు ఇచ్చే విధానం రాబోయే 90 రోజుల్లో అమలవుతుందని కేంద్ర సమాచార మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు. ‘‘ఐదేళ్లలో 300 కార్గో టెర్మినళ్లను అభివృద్ధి చేస్తాం. తద్వారా 1.25 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. కార్గో టెర్మినళ్లతో సరుకు రవాణాలో రైల్వే వాటా కూడా పెరుగుతుంది’’ అని తెలిపారు. దన్నారు.

ఆధునిక విద్యకు పెద్దపీట  
పీఎం–శ్రీ స్కూళ్లలో ఆధునిక విద్యావిధానం అమలు చేస్తారు. స్మార్ట్‌ తరగతి గదులు, క్రీడలు, సదుపాయాలపై పథకం దృష్టి సారిస్తుంది. వీటిని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. దీనికింద రాష్ట్రాలు, స్కూళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంతో 18.7 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని అంచనా.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top