తూర్పు లద్దాఖ్‌లో శాంతితోనే సత్సంబంధాలు

Unilateral change of status quo not acceptable - Sakshi

చైనాకు స్పష్టం చేసిన భారత్‌

దుషాంబెలో ఇరుదేశాల విదేశాంగ మంత్రుల భేటీ

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో యథాతథ స్థితి కొనసాగుతుండడం, బలగాల ఉపసంహరణ విషయంలో చైనా సానుకూల చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతికూలతలు నెలకొన్నాయని భారత్‌ చైనాకు స్పష్టం చేసింది. షాంఘై కోఆపరేషన్‌ కార్పొరేషన్‌(ఎస్‌సీఓ) సదస్సు సందర్బంగా బుధవారం దుషాంబెలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ల మధ్య ప్రత్యేకంగా సమావేశం జరిగింది. వాస్తవాధీన రేఖ వెంట ఎలాంటి ఏకపక్ష మార్పులను భారత్‌ అంగీకరించబోదని ఈ సందర్భంగా జై శంకర్‌ వాంగ్‌ యికి స్పష్టం చేశారు. తూర్పు లద్దాఖ్‌లో పూర్తి స్థాయిలో శాంతి నెలకొన్న తరువాతనే ఇరుదేశాల మధ్య సానుకూల సంబంధాలు సాధ్యమవుతాయన్నారు

. రెండు దేశాల మధ్య మిలటరీ స్థాయిలో తదుపరి దశ చర్చలు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ప్యాంగ్యాంగ్‌ సరస్సు ప్రాంతం నుంచి ఫిబ్రవరిలో ఇరుదేశాల బలగాలు వెనక్కు వెళ్లిన తరువాత.. ఇతర వివాదాస్పద ప్రదేశాల నుంచి బలగాలను ఉపసంహరించే ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొంది. తూర్పు లద్దాఖ్‌లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నించడంతో ఇరుదేశాల సంబంధాలు దిగజారిన విషయాన్ని జైశంకర్‌ ప్రస్తావించారు. ‘తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొని ఉన్న మిగతా అన్ని సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కారం సాధించాల్సిన అవసరం ఉంది’ అని జై శంకర్‌ స్పష్టం చేశారని విదేశాంగ శాఖ తెలిపింది.   

అఫ్గాన్‌లో శాంతి స్థాపనే లక్ష్యం
ఉగ్రవాదాన్ని కలసికట్టుగా ఎదుర్కోవడం, ఉగ్ర సంస్థలకు ఆర్థిక సహకారాన్ని ఆపేయడం షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీఓ) తప్పనిసరిగా చేయాలని జై శంకర్‌ అన్నారు. రష్యా, పాకిస్తాన్, చైనా విదేశాంగ మంత్రులతో కలిసి బుధవారం ఆయన ఎనిమిది సభ్య దేశాలు ఉన్న ఎస్‌సీఓ కీలక సదస్సులో పాల్గొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top