సాక్షి, చెన్నై: డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వారసుడు, ఎమ్మెల్యే ఉదయ నిధి స్టాలిన్‌కు ఆ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పదవిని మళ్లీ అప్పగించారు. ఆ విభాగంలో 8 మంది కొత్త వారికి చోటు కల్పించారు. అలాగే, డీఎంకే ఎంపీ కనిమొళి చేతిలో ఉన్న మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పగ్గాలను కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌కు చెందిన హెలెన్ డేవిడ్సన్‌కు అప్పగించారు.
వివరాలు.. సినీ నటుడు, నిర్మాత, స్టాలిన్ వారసుడు ఉదయ నిధి స్టాలిన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రత్యక్ష రాజకీయాలోకి వచ్చిన విషయం తెలిసిందే. వచ్చి రాగానే డీఎంకేకు వెన్నెముకగా ఉన్న ఆ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు. ఆ ఎన్నికల్లో ఆయన సుడిగాలి పర్యటనతో ప్రజల్ని ఆకర్షించారు. అలాగే, చేపాక్కం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ మెట్లు కూడా ఎక్కారు. పార్టీ యువజన విభాగం బలోపేతంలో దూసుకెళ్తున్న ఉదయ నిధికి మళ్లీ అదే బాధ్యతలను అప్పగిస్తూ డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ బుధవారం ఓ ప్రకటన చేశారు.
చదవండి: (రాష్ట్రస్థాయిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి కీలక బాధ్యతలు)
కొత్త వారికి చోటు..
డీఎంకే యువజన విభాగంలో ప్రధాన కార్యదర్శి, నలుగురు సంయుక్త కార్యదర్శులు ఉంటారు. ఇది వరకు ప్రధాన కార్యదర్శిగా ఉదయనిధి స్టాలిన్, సంయుక్త కార్యదర్శులుగా తాయగం కవి, ఆర్‌డీ శేఖర్, జోయల్, పారివేందర్ ఉండేవారు. అయితే సంయుక్త కార్యదర్శుల సంఖ్యను ఈసారి తొమ్మిదికి పెంచారు. అలాగే, పాతవారిలో జోయల్‌కు మాత్రం మళ్లీ అవకాశం కల్పించారు. మిగిలిన వారిని పక్కన పెట్టారు. యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్‌కు మళ్లీ బాధ్యతలు అప్పగించారు. సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా జోయల్, రఘుపతి, ప్రకాష్, ప్రభు, శ్రీనివాసన్, రాజ, ఏఎన్ రఘు, ఇలయరాజ, అబ్దుల్ మాలిక్‌ను నియమించారు. తన మీద నమ్మకంతో మళ్లీ బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధిష్టానికి ఉదయ నిధి కృతజ్ఞతలు తెలియజేశారు.
మహిళా ప్రధాన కార్యదర్శిగా హెలెన్
డీఎంకే మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ ఎంపీ కనిమొళి ఆది నుంచి వ్యవహరిస్తూ వచ్చారు. ఇటీవల ఆమెకు ప్రమోషన్ దక్కింది. డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ఆమెకు అప్పగించారు. దీంతో మహిళా విభాగం బాధ్యతలను మరొకరికి అప్పగించాలని నిర్ణయించారు. తాజాగా ఈవిభాగంలో సమూ ల మార్పులు చేశారు. ఆ విభాగం అధ్యక్షురాలిగా విజయ దయాల్ అన్భును నియమించారు. ప్రధాన కార్యదర్శి పదవిని కన్యాకుమారి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ హెలెన్ డేవిడ్సన్‌కు అప్పగించారు. సంయుక్త కార్యదర్శిగా కుమారి విజయకుమార్, ఉపాధ్యక్షులుగా భవానీ, మంత్రి కయల్‌వెలి సెల్వరాజ్ నియమితులయ్యారు.


