
కోకెర్నాగ్: దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఇద్దరు ఆర్మీ జవాన్లు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. కోకెర్నాగ్-గాడోల్ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ చేపడుతున్న సమయంలో ఇద్దరు భారత ఆర్మీ సిబ్బంది అదృశ్యమయ్యారని బుధవారం సంబంధిత వర్గాలు తెలిపాయి. పారా కమాండోస్ యూనిట్‌కు చెందిన ఈ సైనికులు సోమవారం (అక్టోబర్ 6) ఉగ్రవాదులను నిర్మూలించేందుకు చేపట్టిన ఆపరేషన్ బృందంలో సభ్యులని తెలిపారు.
ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సైన్యానికి నిఘా సమాచారం అందిన దరిమిలా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో ఇద్దరు ఆర్మీ సిబ్బంది తమ యూనిట్‌తో సంబంధాలు కోల్పోయారని, అప్పటి నుండి వారి జాడ కనిపించడం లేదని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ నేపధ్యంలో అదృశ్యమైన సైనికులను వెదికేందుకు సైన్యంతో పాటు జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు.
దోడా- కిష్త్వార్ జిల్లాల సరిహద్దుల్లోనిపిర్ పంజాల్ పర్వత శ్రేణి వెంబడి ఉన్న ప్రాంతంలో ఈ ఇద్దరు సైనికులు అదృశ్యమయ్యారు. ఈ ప్రాంతం దట్టమైన అడవితో కూడి ఉంటుంది. కొంతకాలంగా ఈ ప్రాంతంలో కురుస్తున్న మంచు, భారీ వర్షాలు సెర్చ్ అపరేషన్‌కు సవాలుగా మారాయి. తప్పిపోయిన సిబ్బందిని ఉగ్రవాదులు అపహరించారా లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం భద్రతా దళాలు అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.