సాయం కోరిన మహిళకు ఎదురైన చేదు అనుభవం

Twitter User Recounts Intimacy For Oxygen Offer Received By Friend - Sakshi

వైరలవుతోన్న ట్వీట్‌

మానవత్వానికే మాయని మచ్చ అంటూ నెటిజనుల ఆగ్రహం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మనుషులతో పాటు మానవత్వాన్ని మింగేస్తుంది. ఓవైపు ప్రజలు కోవిడ్‌తో అల్లాడుతుంటే.. దీన్ని అదునుగా తీసుకుని కొందరు మనుషులు ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం. వైరస్‌ విజృంభిస్తోన్న వేళ ఆక్సిజన్‌ సిలిండర్‌, అంబులెన్స్‌, కొన్ని ఔషధాలకు విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. దాంతో కొందరు వ్యక్తులు ఏమాత్రం జాలి, దయ లేకుండా అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తూ.. జలగల్లా జనాల రక్తాన్ని పీలుస్తున్నారు. మరి కొందరు నీచులు అంతటితో ఆగక మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. 

అపత్కాలంలో ఆడవారు సాయం కోరితే దాన్ని అదునుగా తీసుకుని అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. విచారకరమైన అంశం ఏంటంటే కొన్ని చోట్ల బాధితులకు ఎంతో కాలంగా తెలిసిన వారు.. మంచి వారుగా ముద్ర వేయించుకున్న వారు ఇలా ప్రవర్తించడం. తాజాగా ఓ ట్విట్టర్‌ యూజర్‌ ఇలాంటి సంఘటన గురించి ట్వీట్‌ చేయగా ప్రస్తుతం అది తెగ వైరలవుతోంది. మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిని ఆ సంఘటన ఆ వివరాలు.. 

సదరు ట్విట్టర్‌ చేసిన ట్వీట్‌లో ‘‘నా స్నేహితుడి సోదరి తండ్రి కోవిడ్‌ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అత్యవసరంగా ఆక్సిజన్‌ సిలిండర్‌ కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో బాధితురాలు.. చిన్నతనం నుంచి తనను సోదరిగా భావించిన పొరుగింటి వ్యక్తికి తన పరిస్థితిని వివరించి.. సాయం చేయాల్సిందిగా కోరింది. దానికి అతడు ‘‘తప్పకుండా హెల్స్‌ చేస్తాను. అందుకు బదులుగా నువ్వు నాతో శృంగారానికి ఒప్పుకోవాలి. నా గదికి వచ్చి గడిపితే.. వెంటనే ఆక్సిజన్‌ సిలిండర్‌ ఏర్పాటు చేస్తాను’’ అన్నాడు. అతడి మాటలు విని బాధితురాలు షాక్‌ అయ్యింది. చిన్నతనం నుంచి తనను చెల్లి అని పిలిచిన వ్యక్తి ఇంత నీచుడా అనుకుని ఎంతో ఆవేదన చెందింది’’ అంటూ వెల్లడించి.. ‘‘ఇలాంటి వారిని ఏం చేయాలో చెప్పండి’’ అని నెటిజనులను కోరాడు సదరు ట్విట్టర్‌ యూజర్‌.

ఈ ట్వీట్‌పై ‘‘వెంటనే అతడిపై  పోలీసులకు ఫిర్యాదు చేయండి’’ అని కొందరు సూచించగా.. మరి కొందరు ‘‘సదరు అపార్ట్‌మెంట్‌ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లండి’’ అనగా.. మరి కొందరు ‘‘అతడి పేరు, ఫోటో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయండి. పబ్లిక్‌గా పరువు తీస్తే తప్ప ఇలాంటి వారికి బుద్ధి రాదు’’ అని కామెంట్‌ చేస్తున్నారు. ఇక గతంలో ముంబైకి చెందిన ఓ మహిళ ప్లాస్మా కావాలి.. దాతలు సంప్రదించాల్సిందిగా కోరుతూ.. తన పర్సనల్‌ నంబర్‌ ఇవ్వడంతో ఎంత టార్చర్‌ అనుభవించిందో ట్విట్టర్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. 

చదవండి: ఛీ.. ఛీ: ప్లాస్మా కోసం సోషల్‌ మీడియాలో నంబర్‌ షేర్‌ చేస్తే..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top