ఛీ.. ఛీ: ప్లాస్మా కోసం సోషల్‌ మీడియాలో నంబర్‌ షేర్‌ చేస్తే..

Mumbai Woman Shared Phone Number Online to Find Ventilator And Molested - Sakshi

సాయం చేయమని కోరుతూ ఫోన్‌ నంబర్‌ షేర్‌ చేసిన మహిళ

లైంగిక వేధింపులకు గురి చేసిన ప్రబుద్ధులు

ముంబై: మగవారిలో కొందరు మగానుభావులు ఉంటారు. వీరికి సమయం, సందర్భం ఇలాంటి ఏం పట్టవు. ఆడగాలి సోకితే చాలు.. చిత్తకార్తి కుక్కలా మారిపోతారు. అవతలి మనిషి పరిస్థితిని ఏ మాత్రం అర్థం చేసుకోకుండా వారిని వేధింపులకు గురి చేస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ముంబైలో చోటు చేసుకుంది. ఓ మహిళా కరోనా బారిన పడిన తన కుటుంబ సభ్యుల కోసం ప్లాస్మా, వెంటిలేటర్స్‌ కావాలి.. దాతలు ఎవరైనా సాయం చేయండని కోరుతూ.. సోషల్‌ మీడియాలో తన పర్సనల్‌ మొబైల్‌ నంబర్‌ షేర్‌ చేసింది. 

ఇంకేముంది.. మహిళ సెల్‌ నంబర్‌ దొరికడంతో కొందరు మృగాళ్లు ఆమె పరిస్థితిని అర్థం చేసుకోకుండా.. లైంగిక వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. దాంతో సదరు మహిళ ‘‘సాయం కోసం నంబర్‌ షేర్‌ చేసాను.. ఇలాంటి సమయంలో కూడా ఆడవారిని ఏడిపించే ప్రబుద్ధులు.. మెడికల్‌ ఎమర్జెన్సీలో కూడా కేవలం జననేంద్రియాలతో ఆలోచించే దరిద్రులు ఉంటారని అస్సలు అనుకోలేదు.. ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళలు తమ నంబర్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయకూడదు’’ అంటుంది బాధితురాలు.

ఆ వివరాలు.. ముంబైకి చెందిన శస్వతి శివ అనే యువతి కుటుంబ సభ్యులు కోవిడ్‌ బారిన పడ్డారు. వారి చికిత్సలో భాగంగా ప్లాస్మా, వెంటిలేటర్స్‌ అవసరం అయ్యాయి. దాంతో తనకు తెలిసిన వారందరికి కాల్‌ చేసి సాయం చేయమని అడిగింది. కానీ లాభం లేకపోయింది. లేట్‌ చేసిన కొద్ది కోవిడ్‌ బారిన పడిన వారికి ప్రమాదం. దాంతో ఆమె తన పరిస్థితిని వివరిస్తూ.. ప్లాస్మా, వెంటిలేటర్స్‌ కోసం అర్థిస్తూ సోషల్‌ మీడియాలో మెసేజ్‌ చేసింది. దాతలు తనను సంప్రదించేందుకు వీలుగా ఆమె పర్సనల్‌ సెల్‌ నంబర్‌ని షేర్‌ చేసింది. 

ఇక మొదలైంది టార్చర్‌. ఫోన్‌ మోగిన ప్రతి సారి ఆమె తనకు సాయం లభిస్తుందనే ఉద్దేశంతో ఆశగా కాల్‌ లిఫ్ట్‌ చేసేది. కానీ చాలా సార్లు ఆమెకు నిరాశే ఎదురయ్యింది. ఆమెకు కాల్‌ చేసిన వారు అందరూ మగవారు. వారిలో చాలా మంది ‘‘మీరు ఎక్కడ ఉంటున్నారు’’.. ‘‘మీరు సింగిలా’’.. ‘‘నేను మీకు సాయం చేస్తాను కానీ నాతో డేట్‌కి వస్తారా’’.. ‘‘మీ డీపీ చాలా బాగుంది’’ వంటి చెత్తంతా వాగేవారు. ఇక మరి కొందరు ప్రబుద్ధులు మరో అడుగు ముందుకు వేసి.. వీడియో కాల్‌ చేయడం.. మార్ఫడ్‌ ఫోటోలు పంపడం చేశారు.

మరో షాకింగ్‌ న్యూస్‌ ఏంటంటే ఆమె ఫోటో కొన్ని అశ్లీల వెబ్‌సైట్‌లలో ప్రత్యక్షం అయ్యింది. ఏడుగురు వ్యక్తులు అయితే ఒకరి ఒకరి తర్వాత ఒకరు ఆమెకు వీడియో కాల్‌ చేస్తూనే ఉన్నారు. జరిగిన సంఘటనలు చూసి ఆమెకు చిరాకెత్తింది. సాయం చేయమని కోరుతూ నంబర్‌ షేర్‌ చేస్తే.. ఇతంటి భయానక అనుభవం ఎదురయ్యింది అంటూ వాపోయింది.

దాంతో శస్వతి శివ ట్విట్టర్‌ ద్వారా తన బాధను వెల్లడించారు. తను ఎదర్కొన్న అనుభవాలను చెప్తూ.. ‘‘మెడికల్‌ ఎమర్జెన్సీ సమయంలో కూడా చాలా మంది మగవారు కేవలం తమ జననేంద్రియాలతో మాత్రమే ఆలోచిస్తారని.. పరిస్థితితో సంబంధం లేకుండా ఆడవారిని వేధిస్తారని ఈ ఘటనతో నాకు బాగా అర్థం అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ వ్యక్తిగత నంబర్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయకండి’’ అంటూ ట్వీట్‌ చేశారు. 

చదవండి: ‘మీ కాళ్లు మొక్కుతా.. నా భార్య చనిపోయేలా ఉంది’ 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top