‘మీ కాళ్లు మొక్కుతా.. నా భార్య చనిపోయేలా ఉంది’

Man Desperate Plea Outside Top Delhi Covid Hospital - Sakshi

ఢిల్లీలో చోటు చేసుకున్న ఘటన

కోవిడ్‌ బారిన పడిన భార్య కోసం భర్త తాపత్రయం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే మూడు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఆస్పత్రులన్ని కోవిడ్‌ రోగులతో కిటకిటలాడుతున్నాయి. చాలా చోట్ల బెడ్స్‌ లేక.. కొత్తగా వస్తున్న పేషంట్స్‌ని లోపలికి అనుమతించడం లేదు. చాలా మంది రోగులు ఆస్పత్రుల బయటే పడిగాపులు గాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ లోక్‌ నాయక్‌ జయ్‌ ప్రకాశ్‌(ఎల్‌ఎన్‌జేపీ) ఆస్పత్రి వద్ద ఓ హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది.

కోవిడ్‌ బారిన పడిన భార్యను ఆస్పత్రి వద్దకు తీసుకువచ్చాడు ఓ వ్యక్తి. అయితే లోపల బెడ్స్‌ ఖాళీగా లేకపోవడంతో.. ఆమెను హాస్టిటల్‌లో చేర్చుకోవడం కుదరదని తెలిపారు సిబ్బంది. దాంతో సదరు వ్యక్తి ‘‘మీ కాళ్లు మొక్కుతా.. నా భార్య చనిపోయేలా ఉంది.. దయచేసి ఆమెను ఆస్పత్రిలో చేర్చుకోండి’’ అంటూ సిబ్బందిని ప్రాధేయపడ్డాడు. కానీ లాభం లేకపోయింది. దేశంలో మహమ్మారి ఎంతటి విలయం సృష్టిస్తుందో ఈ సంఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. రూబీ ఖాన్‌(30) అనే మహిళ కోవిడ్‌ బారిన పడింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్ట్‌ చేశారు. దాంతో ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దాంతో రూబీ ఖాన్‌ భర్త ఏమాత్రం ఆలస్యం చేయకుండా భార్యను బైక్‌ మీద ఎక్కించుకుని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి వద్దకు తీసుకువచ్చాడు. కోవిడ్‌ చికిత్సలో ఇది ఢిల్లీలోనే అతి పెద్ద ఆస్పత్రి. ఇక్కడ తప్పక వైద్యం అందుతుందనే నమ్మకంతో రూబీ ఖాన్‌ భర్త ఆమెను ఇక్కడకు తీసుకువచ్చాడు. 

అయితే అప్పటికే ఆస్పత్రి సిబ్బంది.. లోపల బెడ్స్‌ ఖాళీగా లేవని చెప్పి.. రెండు మూడు అంబులెన్స్‌లు, కొందరు రోగులును బయటే నిలిపివేశారు. ఈ క్రమంలో రూబీ ఖాన్‌ దంపతులును కూడా బయటే నిలిపివేశారు. దాంతో ఆమె భర్త బైక్‌ దిగి.. సిబ్బంది దగ్గరకు వెళ్లి ‘‘నా భార్య చనిపోయేలా ఉంది. ఆమెకు వెంటనే చికిత్స అందించాలి. లోపలికి పంపించడి. మీ కాళ్లు మొక్కుతా’’ అంటూ ప్రాధేయపడ్డాడు. ఇంత బతిమిలాడినా వృధానే అయ్యింది. లోపల బెడ్స్‌ ఖాళీగా లేకపోవడంతో సిబ్బంది వారిని అనుమతించలేదు. చేసేదేం లేక రూబీ ఖాన్‌ దంపతులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించింది. 

చదవండి: ఆసుపత్రుల ముందు ఆక్రందనలు.. ఆర్తనాదాలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top