ఆసుపత్రుల ముందు ఆక్రందనలు.. ఆర్తనాదాలు

India capital Delhi faces hospital beds shortage as coronavirus cases surge - Sakshi

టెస్ట్‌ల కోసం గంటల కొద్దీ నిరీక్షణ..  

ఫలితాల కోసమే నాలుగైదు రోజులు 

పడకలు లేక విలవిల 

ఆసుపత్రుల ముందు అంబులెన్స్‌ల క్యూ 

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆసుపత్రులు కిక్కిరిసిపోవడంతో పడకలు ఖాళీ లేక కోవిడ్‌ బాధితులు అల్లాడుతున్నారు. దగ్గు, ఆయాసం, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా ఒక్క ఆసుపత్రిలోనూ బెడ్‌ ఖాళీ లేక పేషెంట్లు విలవిల్లాడుతున్నారు. దేశరాజధాని ఢిల్లీలో ఈ పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. 19,322 కోవిడ్‌ బెడ్స్‌కు గాను 3,340 ఖాళీగా ఉన్నట్టు, 4,376 కోవిడ్‌ ఐసీయూ బెడ్స్‌కు గాను 57 ఖాళీగా ఉన్నట్టు ఆన్‌లైన్‌ పోర్టల్‌ చూపుతున్నా.. ఏ ఒక్క ఆసుపత్రి నెంబరూ పలకదు. ప్రతి ఆసుపత్రిలోనూ ఫోన్‌ బిజీ టోన్‌ వస్తోంది. టెస్టింగ్‌ కోసం, ఫలితం కోసం నాలుగైదు రోజులు వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. 

లక్షణాలు ఉన్నా ఒకవేళ టెస్టింగ్‌లో వైరస్‌ దొరక్క నెగెటివ్‌ వస్తే, చెస్ట్‌ సీటీ స్కానింగ్‌ చేయించాలంటే ల్యాబ్‌ల ముందు పెద్దపెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. సోమవారం ఉదయం ఢిల్లీలో ప్రారంభమైన డీఆర్‌డీవో కోవిడ్‌ ఆసుపత్రిలో 250 పడకలు ఉండగా.. అత్యంత సీరియస్‌గా ఉన్న పేషెంట్లకు మాత్రమే అడ్మిషన్లు కల్పించినప్పటికీ.. ఇంకా బయట దాదాపు 250కి పైగా ఆంబులెన్స్‌లు పేషెంట్లతో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

సోషల్‌ మీడియాలో ఆర్తనాదాలు..
ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, నాగ్‌పూర్‌ వంటి నగరాలలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్లాస్మా కోసం, కోవిడ్‌ బెడ్‌ కోసం, ఆక్సిజన్‌ సిలిండర్‌ కోసం, వెంటిలేటర్ల కోసం కొందరు, రెమిడెవిసిర్‌ ఇంజెక్షన్, టాసిలైజుమాబ్‌ ఇంజెక్షన్‌ కోసం సోషల్‌ మీడియా ద్వారా ఆర్తనాదాలు చేస్తున్నారు. కోవిడ్‌ హెల్ప్, కోవిడ్‌ ఎమర్జెన్సీ, కోవిడ్‌ 19, కోవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ ఇండియా వంటి హ్యాష్‌టాగ్‌లు ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి.

టాలీవుడ్, బాలీవుడ్‌ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు తమకు  వచ్చిన వినతుల మేరకు స్టేటస్‌ మెసేజ్‌లు షేర్‌ చేస్తున్నారు. టాసిలైజుమాబ్‌కు ప్రత్యామ్నాయంగా వాడే అల్జుమాబ్‌ వంటి ఔషధాలు కూడా స్టాక్‌ లేకుండా పోయాయి. కోవిడ్‌ చికిత్సలో వినియోగించే ఇమ్యునోసిన్‌ అల్ఫా 1 ఇంజెక్షన్‌. ఇనోక్జాపారిన్‌ వంటి ఔషధాలు కూడా వివిధ నగరాల్లో అందుబాటులో లేవు. అందుబాటులో ఉన్న మందులను సైతం బ్లాక్‌లో చెలామణి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

న్యాయస్థానాల ఆగ్రహం.. 
కోవిడ్‌ బాధితుల పరిస్థితి విషమిస్తుండడంతో కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలహాబాద్‌ హైకోర్టు ఏప్రిల్‌ 26 వరకు యూపీలోని 5 నగరాల్లో లాక్‌డౌన్‌ విధించాలని ఆదేశించింది. ప్రయాగ్‌రాజ్, వారణాసి, లక్నో, గోరఖ్‌పూర్, కాన్పూర్‌ నగరాల్లో లాక్‌డౌన్‌ విధించాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు కూడా లాక్‌డౌన్‌ లేదా కర్ఫ్యూ విధింపునకు ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇచ్చింది.

చదవండి: 

మానవ తప్పిదంతో కరోనా వేగంగా వ్యాప్తి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top