టీఎంసీకి షాక్‌.. స్కూల్‌ జాబ్‌ స్కాం కేసులో ఎమ్మెల్యే అరెస్ట్‌

Trinamool MLA Manik Bhattacharya Arrested In Bengal Jobs Scam - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో షాక్‌ ఇచ్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ). పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో టీఎంసీ ఎమ్మెల్యే మానిక్‌ భట్టాచర్యను మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్‌ చేసింది. టీచర్స్‌ జాబ్‌ స్కాంలో భాగంగా సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన ఈడీ.. ఉదయం అరెస్ట్‌ చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి పార్థా ఛటర్జీని అరెస్ట్‌ చేసింది. ఆయన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో భారీగా నగదు దొరికిన క్రమంలో ఆయనను అరెస్ట్‌ చేసింది.

పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో అక్రమ నగదు లావాదేవీలకు సంబంధించి దర్యాప్తు చేపట్టింది ఈడీ. ఇప్పటికే అరెస్టైన మాజీ మంత్రి పార్థా ఛటర్జీ వాట్సాప్‌ చాట్‌ను పరిశీలించగా ఈ కేసులో లంచాలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే భట్టాచార్యపై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్‌ తర్వాత భట్టాచార్యను వైద్య పరీక్షల నిమిత్తం తరలించి.. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. పార్థా ఛటర్జీ అరెస్ట్‌ తర్వాత మానిక్‌ భట్టాచార్య పేరు బయటకు రావటంతో..  ఆయనను బెంగాల్‌ ప్రాథమిక విద్యా బోర్డు అధ్యక్ష పదవి నుంచి తొలగించారు.

ఇదీ చదవండి:  Bengal Schools Scam: పార్థా చటర్జీకి చెందిన రూ.46 కోట్ల ఆస్తులు అటాచ్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top