Tomato Flu In Kerala: ‘టమాటో ఫ్లూ’ కలకలం.. చిన్నారుల్లో శరవేగంగా వ్యాపిస్తున్న వైనం

Tomato Flu Cases Reported In Kerala Highly - Sakshi

మరో అంతుచిక్కని వ్యాధి కలకలం మొదలైంది. కేరళలో  వెలుగు చూసిన టమాటో ఫ్లూ గురించి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగతిన వ్యాపిస్తున్న ఈ ఇన్‌ఫెక్షన్‌.. ఇప్పటిదాకా సుమారు 80 మంది చిన్నారులకు పైనే సోకింది. కోల్లాం ప్రాంతం ప్రధానంగా ఈ వ్యాధి విస్తరిస్తుండడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు అంతా. మరోవైపు ఈ ఇన్‌ఫెక్షన్‌ ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు.

టమాటో ఫ్లూ అంటే.. ఇది అరుదైన డిసీజ్‌. ఇంతకు ముందు ఏయే దేశాల్లో, ప్రాంతాల్లో సోకిందనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఏ కారణం చేత వ్యాపిస్తుంది అనేదానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.  కానీ, ఈ ఫ్తూ వల్ల ఒంటిపై ఎరుపు రంగు దద్దుర్లు వస్తాయి. డీహైడ్రేషన్‌తో పాటు చికాకుగా అనిపిస్తుంటుంది. ఆ బొబ్బలు టమాటో ఆకారంలో ఉండడంతోనే.. ఈ వ్యాధికి టమాటో ఫ్లూ అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఐదేళ్లలోపు చిన్నారుల మీదే ఈ ఫీవర్‌ ప్రభావం కనిపిస్తోంది. 

లక్షణాలు.. టమాటో ఆకారంలో బొబ్బలు రావడం ఈ వ్యాధి ప్రాథమిక లక్షణం. దీంతో పాటు చికున్‌గున్యా తరహాలోనే అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, కీళ్ల వాపులు, అలసట కనిపిస్తాయి. కేరళలోని కోల్లాంతో పాటు దక్షిణ ప్రాంతాలైన అర్యన్‌కావు, అంచల్‌, నెడువతుర్‌ ప్రాంతాల్లోనూ కేసులు  నమోదు అవుతున్నాయి. 

సరిహద్దులో నిఘా.. ఈ మిస్టరీ వ్యాధి కలకలంతో.. సరిహద్దు రాష్ట్రం తమిళనాడు అప్రమత్తం అయ్యింది. ఇరు రాష్ట్రాల ప్రయాణాలపై ఆందోళన వ్యక్తం అవుతోంది. వేగంగా ఈ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తిస్తుండడంతో జాగ్రత్తగా ఉండకపోతే తీవ్ర నష్టం తప్పదని వైద్యాధికారులు చెప్తున్నారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కొయంబత్తూరు(తమిళనాడు) ప్రవేశించే దారుల గుండా పరీక్షలు మొదలుపెట్టారు.

అలాగే వలయార్‌లోనూ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు మెడికల్‌ ఆఫీసర్లు.. ప్రయాణికులను ప్రత్యేకించి పిల్లలను పరీక్షిస్తున్నారు. అదే సమయంలో అంగన్‌వాడీల్లో 24 సభ్యులతో కూడిన బృందం సైతం పరీక్షలు నిర్వహిస్తోంది. టమాటో ఫ్లూ పై పరిశోధనల అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇన్‌ఫెక్షన్‌ సోకిన పిల్లలకు.. ఇతర పిల్లలను దూరంగా ఉంచాలని, డీహైడ్రేషన్‌ కాకుండా జాగ్రత్తపడాలని, అలాగే వైద్య పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

చదవండి: 19 ఏళ్ల తర్వాత.. చనిపోయిన వ్యక్తి.. మళ్లీ ప్రాణాలతో..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top