కరోనా థర్డ్‌ వేవ్‌ తప్పదు: సంచలన హెచ్చరికలు

 Third Wave Inevitable: Grim Warning From Government's Scientific Adviser - Sakshi

కేంద్ర ప్రధాన సాంకేతిక సలహాదారుడు విజయరాఘవన్‌ సంచలన వ్యాఖ్యలు

భారత్‌కు కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు

ఎపుడు, ఎలా వస్తుందో తెలియదు.. కానీ అనివార్యం 

సాక్షి,న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌వేవ్‌ ప్రకంపనలతో ఇప్పటికే దేశం మొత్తం అతలాకుతలమవుతుంటే కేంద్ర ప్రధాన సాంకేతిక సలహాదారుడు డాక్టర్ కే విజయరాఘవన్ సంచలన  వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా మహమ్మారి థర్డ్‌ వేవ్‌ తప్పదంటూ అత్యున్నత శాస్త్రీయ సలహాదారు బాంబు పేల్చారు. వేవ్‌ ఎప్పుడొస్తుంది?ఎలా వస్తుందో స్పష్టత లేనప్పటికీ ముప్పు తప్పదన్నారు. అంతేకాదు థర్డ్‌ వేవ్‌ నాటికి వైరస్‌ మరింతగా మారవచ్చని, భవిష్యత్‌లో మరిన్ని వేవ్‌లు వచ్చే అవకాశం ఎక్కువని తెలిపారు. కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేలా వ్యాక్సిన్‌ తయారు చేసుకోవాలని విజయరాఘవన్‌ సూచించారు. అయితే ప్రస్తుత వేరియంట్లపై వ్యాక్సిన్‌ బాగా పని చేస్తోందని తెలిపారు. 

దేశంలో మహమ్మారి అంతానికి, కొత్త రకం వైరస్‌లను ఎదుర్కోనేందుకు టీకాల పరిశోధనలను పెంచాల్సిన అవసరం ఉందని విజయరాఘవన్ హెచ్చరించారు. ఈ వైరస్ అధిక స్థాయిలో విజృంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని ఎదుర్కొనేందుకు పలు మార్పులు, కఠిన ఆంక్షలు, మార్గదర్శకాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. కాగా ఇప్పటికే కరోనా విజృంభణ రికార్డు స్థాయిలో కొనసాగుతోంది.  గత వారం రోజులుగా 3 లక్షలకు తగ్గకుండా నమోదవుతున్న రోజువారీ కేసులు బుధవారం నాటి గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3.82లక్షల కేసులు నమోదైనాయి. ఒక్క రోజుకు చనిపోతున్న సంఖ్య రికార్డు స్థాయిలో 3,780కి పెరిగింది. ప్రపంచ కేసులలో 46 శాతం భారత్ వాటా ఉందని, గత వారంలో ప్రపంచ మరణాలలో నాలుగింట ఒక వంతుగా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ  తెలిపిన సంగతి తెలిసిందే.

చదవండి:  కరోనా విలయం: తండ్రి చితిపై దూకేసిన కుమార్తె
Tirupati: కానిస్టేబుల్‌ సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top