మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు వచ్చాయి. అధికార మహాయుతి కూటమి పురపాలక సంస్థ ఎన్నికలలో ప్రభంజనం సృష్టించింది. 25 ఏళ్లకు పైగా ముంబైని శాసించిన ఠాక్రే కుటుంబానికి ఈ సారి ముంబై పీఠం కోల్పోవాల్సి వచ్చింది. అయితే దీనిపై శివసేన (ఠాక్రే) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. పదవిలో లేకపోయినా మరాఠా ప్రజలకు శివసేన ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.
దివంగత నేత బాలసాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ ఒకప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను శాసించింది. మరాఠా సంస్కృతి, భాష స్థానికతే ప్రధాన ఎజెండాగా ఆ పార్టీ రాజకీయాలు జరిపింది. అయితే ఎన్నోసార్లు కూటమి ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర వహించిన శివసేన ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం తిరుగులేని అధిపత్యాన్ని కనబరిచేది. గత 25 ఏళ్లుగా ముంబై మేయర్ పీఠం శివసేన( ఠాక్రే) వర్గానిదే అంటే ఆ ప్రాంతంలో ఠాక్రేలు ఎంత ప్రభావం చూపగలరో చెప్పవచ్చు. అయితే నిన్న( శుక్రవారం) జరిగిన ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి స్పష్టమైన అధిపత్యం కనబరిచి ముంబై పీఠం కైవసం చేసుకుంది.
ఈ నేపథ్యంలో శివసేన ఠాక్రే సోదరులు ఓటమి తర్వాత తొలిసారిగా స్పందించారు. దివంగత నేత బాలాసాహెబ్ ఠాక్రేతో ఫోటోతో కూడిన లేఖను ఉద్దవ్ ఠాక్రే పోస్టే చేశారు." చేసే పోరాటం ముగియలేదు. మరాఠీలకు వారు కోరుకున్న విధంగా గౌరవం లభించేంత వరకూ ఇది ముగియదు" అని అన్నారు.
ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే స్పందిస్తూ "ప్రస్తుతం అధికారంలో ఉన్న శక్తులు మరాఠా ప్రజలను వేదించడానికి లభించే ఒక్క అవకాశాన్ని కూడా వదలరు. కనుక మనమంతా అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికలు వచ్చిపోతుంటాయి. కానీ మనం మరాఠా ప్రజలకోసం ఉన్న సంగతి మర్చిపోకూడదు. మరాఠా ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే తమ పార్టీ కార్పొరేటర్లు వారిని మోకాళ్ల మీద నిలబడేలా చేస్తారు" అని లేఖ విడుదల చేశారు.
కాగా మహారాష్ట్రలో 29 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో 25 చోట్ల మహాయుతి కూటమి విజయాన్ని సాధించింది. అక్కడ మెుత్తం 227 కౌన్సిల్ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 114 అయితే బీజైపీకి 89 స్థానాలు రాగా శివసేన (శిండే) 29 వార్డులు సాధించింది.


