Former HC Chief Justice Thottathil B Radhakrishnan Passed Away - Sakshi
Sakshi News home page

తెలంగాణ హైకోర్టు తొలి సీజే.. జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌ కన్నుమూత

Apr 3 2023 10:42 AM | Updated on Apr 3 2023 10:55 AM

Telangana First HC CJ Justice TB Radhakrishnan Passed Away - Sakshi

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుతో పాటు తెలంగాణకు తొలి సీజేగా.. 

తిరువనంతపురం: న్యాయ కోవిదుడు జస్టిస్‌ తొట్టాటిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్(63) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కొచ్చిలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కన్నుమూశారు. 

సొంత రాష్ట్రం కేరళ హైకోర్టు జడ్జిగా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన రాధాకృష్ణన్‌.. అటుపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు(హైదరాబాద్‌ హైకోర్టు), ఆపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారాయన.

అంతకు ముందు సుదీర్ఘకాలంగా కేరళ హైకోర్టు జడ్జిగా(2004-17) బాధ్యతలు నిర్వహించి.. శాశ్వత న్యాయమూర్తి హోదా దక్కించుకున్నారు.  ఆ సమయంలోనే రెండుసార్లు తాత్కాలిక సీజేగానూ కేరళ హైకోర్టులో బాధ్యతలు నిర్వహించారు. 

ఆపై 2017 మార్చిలో ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. అటుపై బదిలీ మీద హైదరాబాద్‌ హైకోర్టు(తెలుగు రాష్ట్రాల ఉమ్మడి)కు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. 2019 జనవరి 1వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి పూర్తిస్థాయి సీజేగా ఆయన ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. ఆపై నాలుగు నెలలకే కోల్‌కతా హైకోర్టుకు బదిలీ మీద వెళ్లారు. 

అడ్వొకేట్‌ దంపతులు భాస్కరన్‌ నాయర్‌, పారుకుట్టి అమ్మ దంపతులకు కొల్లాంలో జన్మించారు రాధాకృష్ణన్‌. కోలార్‌ కేజీఎఫ్‌ లా కాలేజీ నుంచి లా డిగ్రీ అందుకుని.. 1983 నుంచి తిరువనంతపురం కోర్టులో ప్రాక్టీస్‌ మొదలుపెట్టారాయన. ఆపై హైకోర్టుకు వెళ్లారు. కేరళ లీగల్‌ సర్వీసెస్‌ అథారిలీ చైర్మన్‌గానూ ఆయన పని చేశారు. కేరళలోని మానసిక చికిత్సాలయాల పనితీరులో జోక్యం ద్వారా ఈయన పేరు అప్పట్లో ప్రముఖంగా వినిపించింది. రాధాకృష్ణన్‌కు భార్య మీర్యాసేన్‌తో పాటు పార్వతీ నాయర్‌, కేశవరాజ్‌ నాయర్‌ పిల్లలు ఉన్నారు. జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement