‘నీట్‌’ ఫెయిలవుతాననే భయంతో యువకుడి బలవన్మరణం

Teenage NEET Aspirant Self Distructed In TN Salem - Sakshi

రెండుసార్లు ఫెయిల్‌.. ఈసారి కూడా అదే భయంతో మనస్తాపం

తమిళనాడులో నీట్‌పై సర్వత్రా ఆగ్రహం

శాశ్వత మినహాయింపు ఇచ్చేందుకు బిల్లు తెస్తామని ప్రకటన

చెన్నె: వైద్య విద్య కోర్సు (యూజీ)ల్లో ఎంబీబీఎస్, దంత వైద్య సీట్ల భర్తీ కోసం నిర్వహించే ‘నీట్‌’ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష)పై విద్యార్థుల్లో భయాందోళన నెలకొని ఉంది. ఆ పరీక్షపై ఒత్తిడి పెంచుకుని తాజాగా ఓ విద్యార్థి భయాందోళనతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇప్పటికే రెండుసార్లు నీట్‌ రాయగా అర్హత సాధించలేకపోయాడు. ఏడాదిగా మూడోసారి నీట్‌కు శిక్షణ పొందాడు. చివరకు ఆదివారం పరీక్ష ఉండగా ఫెయిలవుతాననే భయాందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడులోని సేలంలో జరిగింది. ఈ ఘటనపై తమిళనాడులో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
చదవండి: సీఎం జగన్‌ ప్రత్యేక చొరవ.. 48 గంటల్లో భూవివాదం పరిష్కారం

సేలం జిల్లా కుజయ్యూర్‌కు చెందిన ధనుశ్‌ (19) నీట్‌కు ప్రిపేరవుతున్నాడు. గతంలో రెండుసార్లు పరీక్ష రాయగా ఉత్తీర్ణత సాధించకపోయాడు. ఈసారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో శిక్షణ తీసుకున్నాడు. తీరా ఆదివారం పరీక్ష ఉండగా భయాందోళన పెంచుకున్నాడు. ఈసారి కూడా ఉత్తీర్ణత సాధించలేమోననే భయంతో పరీక్షకు కొన్ని గంటలు ఉందనగా ఆ యువకుడు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్‌పై ఒత్తిడి పెంచుకున్నట్లు తల్లిదండ్రులు, మృతుడి సోదరుడు నిశాంత్‌ తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ధనుశ్‌ తల్లిదండ్రులు ‘నీట్‌ పరీక్ష రద్దు చేయాలి’ అని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
చదవండి: ప్రతిభకు గుర్తింపు.. విద్యార్థులను ఆకాశాన తిప్పిన టీచర్‌

విద్యార్థి ఆత్మహత్యపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నీట్‌ బలిపీఠం మీద మరొక మరణం. ఈ ఘటన నన్ను షాక్‌కు గురి చేసింది. నీట్‌కు శాశ్వత మినహాయింపు బిల్లును తీసుకువస్తాం’ అని ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం దానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్‌ తెలిపారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top