సమాజాన్ని చీలుస్తున్నాయి

Supreme Court slams TV channels for sensationalising news - Sakshi

చానళ్ల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

టీఆర్పీయే పరమావధిగా మారింది

ప్రతిదాన్నీ సంచలనం చేస్తున్నాయి

వాటిపై నియంత్రణలేమి శోచనీయం

స్వేచ్ఛాయుత మీడియా తక్షణావసరం

పెను సమస్యగా విద్వేష వ్యాఖ్యలు

వ్యాప్తి చేసే చానళ్లపై కఠిన చర్యలు

కేంద్రానికి ధర్మాసనం ఆదేశం

న్యూఢిల్లీ: వార్తల ప్రసారంలో పలు చానళ్ల తీరును ఆక్షేపిస్తూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బాధ్యతారాహిత్యంతో అవి సమాజాన్ని చీలుస్తున్నాయంటూ ఆగ్రహించింది. విద్వేష ప్రసంగాలకు అడ్డుకట్ట వేసేలా చూడటంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్, జస్టిస్‌ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

విద్వేష ప్రసంగాలు సమాజం పాలిట పెను బెడదగా పరిణమించాయంటూ ఈ సందర్భంగా మండిపడింది. వీటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకట్ట వేయాల్సిందేనని స్పష్టం చేసింది. బాధ్యతారాహిత ప్రసారాలతో సమాజంలో సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి విఘాతం కలిగించే చానళ్లపై చట్ట పరిధిలో కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ‘‘మనకు కావాల్సింది సంతులనంతో కూడిన స్వేచ్ఛాయుతమైన మీడియా.

కానీ హెచ్చు టీఆర్పీ రేటింగులు సాధించడమే ఈ రోజుల్లో వార్తల కవరేజీకి పరమావధిగా మారింది. అందుకోసం చానళ్లు తమలో తాము పోటీ పడుతూ ప్రతిదాన్నీ సంచలనాత్మంగా మారుస్తున్నాయి. చాలాసార్లు టీవీల్లో లైవ్‌ చర్చల్లో యాంకర్లు తామే సమస్యలో భాగంగా మారిపోతున్నారు. ప్యానల్లోని వ్యక్తులు మాట్లాడుతుండగానే ఇష్టారాజ్యంగా మ్యూట్‌ చేస్తున్నారు. వారికి తమ వాదన విన్పించే అవకాశమే ఇవ్వడం లేదు. టీవీ దృశ్య మాద్యమం కావడంతో పత్రికల కంటే చాలా శక్తిమంతమైనది. వీక్షకులను ఎంతో ప్రభావితం చేయగలుగుతుంది. దురదృష్టవశాత్తూ ప్రేక్షకుల్లో చాలామంది పరిణతి ఉన్నవాళ్లు కాదు. టీవీలు చూపించే దృశ్యాలను చూసి రెచ్చిపోకుండా ఉండటం కష్టం.

ఈ నేపథ్యంలో పత్రికలకు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మాదిరిగా టీవీ ప్రసారాల విషయంలో ఎలాంటి నియంత్రణ వ్యవస్థా లేకపోవడం శోచనీయం’’ అంటూ జస్టిస్‌ జోసెఫ్‌ ఆందోళన వెలిబుచ్చారు. విద్వేష వ్యాఖ్యల వ్యాప్తి ద్వారా సమస్యలో భాగంగా మారుతున్న టీవీ న్యూస్‌ యాంకర్లను ప్రసారం నుంచి ఎందుకు తప్పించకూడదని ప్రశ్నించారు. చానళ్లు తీర్పరులుగా మారి విచారణ కూడా జరుపుతున్నాయంటూ ఆక్షేపించారు. ‘‘ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాయి. అతనింకా విచారణ ఎదుర్కొంటున్నాడు. ప్రతివారికీ పరువు ప్రతిష్టలుంటాయి’’ అన్నారు.

పోలీసును పొడిచేసినా పట్టించుకోరా!
ఢిల్లీలో ఇటీవల ఒక పోలీసు అధికారిని చైన్‌స్నాచర్‌ పట్టపగలు అందరి ముందే పొడిచేసినా ఎవరూ పట్టించుకోలేదని ఒక్కరూ అడ్డుకోలేదని జస్టిస్‌ నాగరత్న ఆవేదన వెలిబుచ్చారు. ‘‘కానీ చానళ్లలో, బయటా మాత్రం ఎవరు ఏమైనా మాట్లాడే పరిస్థితి నెలకొంది. వార్తా చానళ్లు వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా మన దేశంలో వాటిపై ఇప్పటికీ ఎలాంటి నియంత్రణలూ లేవు. భావ ప్రకటన స్వేచ్ఛ గొప్ప బాధ్యతతో కూడుకుని ఉంటుంది. టీవీ చానళ్లు విద్వేష ప్రసంగాల వ్యాప్తికి పాల్పడి కార్యక్రమాల నియమావళిని ఉల్లంఘిస్తే వాటి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవచ్చు’’ అని స్పష్టం చేశారు. ఒకరిపై అలాంటి చర్యలు తీసుకుంటేనే మిగతా వాళ్లంతా దారికొస్తారని జస్టిస్‌ జోసెఫ్‌ అభిప్రాయపడ్డారు.

గత ఏడాది కాలంలో ఇలాంటి వేలాది ఫిర్యాదులొచ్చాయని, సదరు చానళ్లపై చర్యలు కూడా తీసుకున్నామని న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. భావ ప్రకటన స్వేచ్ఛ చాలా సున్నితమైన అంశమని ధర్మాసనం పేర్కొంది. దానికి భంగం కలగని రీతిలో చానళ్‌ల కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. ఈ సమస్య ఇప్పటికే కేంద్రం దృష్టిలో ఉందని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కె.ఎం.నటరాజ్‌ బదులిచ్చారు. విద్వేష ప్రసంగాలకు చెక్‌ పెట్టేందుకు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌కు సవరణలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు.  

సమస్యగా మారొద్దు
‘‘ప్రత్యక్ష ప్రసారాల్లో చర్చలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత యాంకర్‌దే. యాంకరే సరిగా వ్యవహరించకపోతే భిన్నాభిప్రాయాలను అనుమతించరు. అవతలి వక్తను మ్యూట్‌ చేయడమో, వారిని అసలు ప్రశ్నలే అడగకపోవడమో చేస్తారు. ఇది పక్షపాతమే. ఇలాంటి సందర్భాల్లో యాంకర్లపై ఎన్నిసార్లు చర్యలు తీసుకున్నారు? సమాజంపై ఎంతో ప్రభావం చూపగల అత్యంత బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నామని మీడియాలోని వ్యక్తులు అర్థం చేసుకోవాలి. సమస్యలో భాగంగా మారి మనసుకు ఏది తోస్తే అది మాట్లాడొద్దు’’ అంటూ ధర్మాసనం హితవు పలికింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top