
కేంద్రం, కేరళ, తమిళనాడు, ఎన్‌డీఎంఏలకు నోటీసులు
న్యూఢిల్లీ: కేరళలోని 130 ఏళ్ల ముళ్ల పెరియార్ డ్యామ్ భద్రత, నిర్మాణ స్థిరత్వంపై ఉన్న ఆందోళనల నేపథ్యంలో.. ఈ డ్యామ్‌ను పటిష్టం, బలోపేతం చేయడానికి కొన్ని మార్గదర్శకాలు, ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. ఈ విషయమై కేంద్రం, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలకు అలాగే జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డీఎంఏ)లకు నోటీసులు జారీ చేసింది.
పాత డ్యామ్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త డ్యామ్ నిర్మించాలని కోరుతూ సేవ్ కేరళా బ్రిగేడ్’అనే ఎన్‌జీఓ సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై (పిల్) చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తాజా నోటీసులు జారీ చేసింది. డ్యామ్ భద్రతా అంశాలను అంచనా వేయడానికి, అలాగే కొత్త నిర్మాణం అవకాశాలను పరిశీలించడానికి నిపుణుల బృందం ద్వారా సమీక్ష చేయించాలని కూడా పిల్ కోరడం గమనార్హం. 1895లో కేరళ ఐడుక్కీ జిల్లాలోని పెరియార్ నది మీద ముళ్ల పెరియార్ డ్యామ్ నిర్మాణం జరిగింది. లీజ్ అగ్రిమెంట్ ప్రాతిపదికన ఈ డ్యామ్‌ను తమిళనాడు రాష్ట్రం నిర్వహిస్తోంది.