నిందితుడి మృతి.. నకిలీ రిజిస్ట్రేషన్ల కేసు క్లోజ్‌ | Supreme Court orders on TNGOs land issue | Sakshi
Sakshi News home page

నిందితుడి మృతి.. నకిలీ రిజిస్ట్రేషన్ల కేసు క్లోజ్‌

Jun 12 2026 3:59 AM | Updated on Jun 12 2026 3:59 AM

Supreme Court orders on TNGOs land issue

మరో క్రిమినల్‌ కేసుతోపాటు సివిల్‌ అప్పీల్‌పై విచారణ వాయిదా 

టీఎన్జీవోస్‌ భూముల వ్యవహారంపై సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో నకిలీ భూ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో నిందితుడైన కూకట్‌పల్లి మాజీ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ మృతి చెందడంతో సుప్రీంకోర్టు ఆ కేసు విచారణను ముగిస్తూ కేసును మూసేసింది. అయితే ఇదే భూ వివాదానికి సంబంధించి దాఖలైన మరో క్రిమినల్‌ కేసును పెండింగ్‌లో ఉన్న సివిల్‌ అప్పీల్‌తో జత చేసి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ పీకే మిశ్రా, జస్టిస్‌ ఏఎస్‌ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు వెలువరించింది. 

ఇదీ కేసు నేపథ్యం.. 
మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని సర్వే నం. 156/1/2లో ఉన్న టీఎన్జీవోస్‌ హౌస్‌ బిల్డింగ్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ స్థలాలను నకిలీ పత్రాలతో విక్రయించిన కేసులో మాజీ జాయింట్‌ సబ్‌–రిజి్రస్టార్‌ రచ్చకొండ శ్రీనివాసరావు ఏకైక నిందితుడిగా ఉన్నారు. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ గురువారం విచారణకు వచ్చింది. అయితే శ్రీనివాసరావు ఈ ఏడాది మే 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. 

ఈ నేపథ్యంలో చట్టప్రకారం ఈ కేసు విచారణను ముగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. కానీ ఇదే భూముల ఆక్రమణ, నకిలీ సేల్‌ డీడ్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి శంకరమంచి సత్యనారాయణ తదితరులపై నమోదైన మరో ఎస్‌ఎల్‌పీపైనా కోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులోని ఏడుగురు నిందితుల్లో ఇద్దరు మరణించారని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి బండారి రామచందర్‌ వర్సెస్‌ మైత్రీ కో–ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ పేరుతో 2013 నుంచి భూ ఆక్రమణల నిరోధక చట్టం కింద ఒక సివిల్‌ అప్పీల్‌ సుప్రీంలో పెండింగ్‌లో ఉందని గుర్తుచేశారు. 

టైటిల్‌ వివాదానికి సంబంధించిన ఆ సివిల్‌ కేసుతోపాటే ఈ క్రిమినల్‌ కేసును కూడా విచారించాలని కోరారు. దీనిపై ప్రతివాదుల తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. రిజిస్ట్రేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 22–ఏకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు జరిగాయనేది క్రిమినల్‌ ఆరోపణ అని, దానికి అసలు యాజమాన్య హక్కుల వివాదంతో ముడిపెట్టి సివిల్‌ కేసుతో జత చేయడం సరికాదని వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ అభ్యర్థనకు మొగ్గుచూపుతూ క్రిమినల్‌ ఎస్‌ఎల్‌పీని పెండింగ్‌లో ఉన్న సివిల్‌ అప్పీల్‌తో జత చేసింది. ఈ రెండు కేసులపై వేసవి సెలవులు ముగిశాక తుది విచారణ జరుపుతామని తెలుపుతూ తదుపరి విచారణను వాయిదా వేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement