
కౌన్సెలింగ్‌కు ముందే ఫీజుల వివరాలు వెల్లడించాలి
సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ల విషయంలో కొన్ని కాలేజీలు ముందుగానే సీట్లు బ్లాక్ చేస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. నీట్–పీజీకి సంబంధించి కౌన్సెలింగ్‌కు ముందే ఫీజుల వివరాలు బహిర్గతం చేయాలని అన్ని ప్రైవేట్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలను ఆదేశించింది. సీట్ల బ్లాకింగ్ వల్ల అవకాశం కోల్పోయిన ఇద్దరు అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించాలని అలహాబాద్ హైకోర్టు గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని, లక్నోలోని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేస్తూ తీర్పు వెలువరించింది.
ఈ తీర్పును సవాలు చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టర్ జనరల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. మెడికల్ పీజీ సీట్లను ముందుగానే బ్లాక్ చేసి, ఇష్టా్టనుసారంగా విక్రయించుకోవడం అనేది తప్పుడు చర్య మాత్రమే కాకుండా, వ్యవస్థలో లోపాలకు ఉదాహరణ అని వెల్లడించింది. పారదర్శకత లేకపోవడానికి, ప్రభుత్వ విధానాలు బలహీనంగా ఉండడానికి నిదర్శనమని తెలియజేసింది.
సీట్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌన్సెలింగ్‌కు ముందే ఫీజులను వెల్లడించడం తప్పనిసరి అని స్పష్టంచేసింది. ట్యూషన్, హాస్టల్ ఫీజులు, కాషన్ డిపాజిట్‌తోపాటు ఇతర ఫీజులను విద్యార్థులకు తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది. నేషనల్ మెడికల్ కమిషన్ ఆధ్వర్యంలో కేంద్రీకృత ఫీజుల నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. సీట్లు బ్లాక్ చేసే కాలేజీలకు జరిమానాలు విధించాలని స్పష్టంచేసింది. ఆయా కాలేజీలపై అనర్హత వేటు వేయాలని పేర్కొంది.