
బీసీలకు 42% రిజర్వేషన్లపై తొలుత అక్కడే తేల్చుకోండి
సరైన న్యాయ ప్రక్రియను పాటించాల్సిందేనన్నసుప్రీం ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టును కాదని నేరుగా తమ వద్దకు రావడాన్ని తప్పుబట్టింది. సరైన న్యాయ ప్రక్రియను పాటించాల్సిందేనంటూ, ముందు హైకోర్టుకు వెళ్లమని సూచించింది. పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించింది.
ఇక్కడికి ఎందుకొచ్చారో చెప్పండి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన జీవోపై వంగా గోపాల్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలి సిందే. కాగా ఈ అంశంపై అత్యవసర విచారణ జరపాలని ఆయన కోరారు. అయితే సోమవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టీకల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని కోరారు.
ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో అత్యవసరంగా విచారించాలని అభ్యరి్థంచారు. ఆయన కేసు వివరాల్లోకి వెళ్ళకముందే, జస్టిస్ విక్రమ్‌నాథ్ ఆయన్ను అడ్డుకున్నారు. ‘ముందు మీరు ఆర్టీకల్ 32 కింద ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి?’అని సూటిగా ప్రశ్నించారు. అయినప్పటికీ ఆయన ధర్మాసనాన్ని ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయతి్నంచారు. తమ క్లయింట్‌ను ఇబ్బంది పెట్టేందుకే తెలంగాణ ప్రభుత్వం పని దినాల్లో చివరి రోజైన శుక్రవారం నాడు కీలకమైన సర్క్యులర్ జారీ చేసిందంటూ వాదించారు.
తాము అత్యవసర విచారణ కోసం సాయంత్రం 6 గంటలకు హైకోర్టు న్యాయమూర్తి నివాసానికి కూడా వెళ్లా మని, కానీ అక్కడ ఉపశమనం లభించలేదని నివేదించారు. ఇక 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, ఇప్పుడు కోర్టు జోక్యం చేసుకోకపోతే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. దీంతో జస్టిస్ విక్రమ్‌నాథ్ జోక్యం చేసుకున్నారు.
తొలుత ఆ అడ్డంకిని దాటండి
‘ముందు మీరు ఆ అడ్డంకిని దాటండి, ఆ తర్వాతే కేసు యోగ్యతపై (మెరిట్స్) మేము వాదనలు వింటాం’అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. హైకోర్టులో అనుకూలమైన ఉత్తర్వులు రానంత మాత్రాన, సుప్రీంకోర్టును ప్రత్యామ్నాయంగా వాడుకోవాలని చూడటాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. న్యాయవాదిని ఉద్దేశించి.. ’మీ క్లయింట్లకు మీరు సరైన సలహా ఇచ్చి ఉండాల్సింది..’అని జస్టిస్ విక్రమ్‌నాథ్ వ్యాఖ్యానించారు. పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టును ఆశ్రయి ంచేందుకు స్వేచ్ఛ ఇచ్చారు.
ఈ పరిణామంతో తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సిద్ధమైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి ఆ అవసరం లేకుండా పోయింది. కాగా సుప్రీం నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించినట్టయ్యింది. సుప్రీంకోర్టులో పిటిషన్ నేపథ్యంలో సోమవారం ఏం జరుగుతుందో, కోర్టు ఏం చెబుతుందో, స్థానిక ఎన్నికలు జరుగుతాయో లేదో అనే ఉత్కంఠ నెలకొంది. సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించడంతో ఇక ఈ నెల 8వ తేదీన హైకోర్టులో జరిగే విచారణ, తీర్పు కీలకంగా మారనుంది.