Pegasus: ఆగస్టు మొదటివారంలో విచారిస్తాం: సుప్రీంకోర్టు

Supreme Court to Hear Plea on Pegasus Issue Next Week - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన పెగాసస్‌ వ్యవహారంపై దాఖలు చేసిన పిల్‌ను వచ్చే వారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. పెగాసస్ కుంభకోణంపై కోర్టు పర్యవేక్షణలోని సిట్ దర్యాప్తు కోరుతూ ప్రముఖ జర్నలిస్టులు ఎన్ రామ్, శశి కుమార్ ఇతరులు రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపైన ఆగస్టు మొదటి వారంలో విచారణ చేపడతామని ప్రకటించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నేతృత్వంలోని బెంచ్ దీనిపై విచారణ జరుపుతుంది.

జాతీయ భద్రతపై పెగాసెస్‌ పర్యవసానాల కారణంగా దీనిపై విచారణ అత్యవసరం అని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కపిల్‌ సిబాల్ తెలిపారు. పౌర స్వేచ్ఛపై పెగాసస్ తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెగాసస్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం విపక్ష నాయకులు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థలోని ప్రముఖుల ఫోన్‌ ట్యాప్‌ చేశారనే ఆరోపణలు వెలువడ్డాయి. ఇది భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రకంపనలు సృష్టించిందని సిబాల్‌ తెలిపారు. ఈ అంశంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. దీనిపై "వచ్చే వారం వింటాం" అని సీజేఐ రమణ స్పందించారు.

ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్‌ను ఉపయోగించి దేశంలోని ప్రముఖ పౌరులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్‌లు హ్యాక్‌ చేశారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జి ద్వారా స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని రామ్‌, ఇతరులు డిమాండ్ చేశారు. ఇక పార్లమెంట్‌లో పెగాసస్‌పై రచ్చ జరుగుతుంది. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ.. దీనిపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు అధికారపక్షంపై ఒత్తిడి తెస్తున్నాయి. కీలక నేతల ఫోన్ సంభాషణలను పెగాసస్ ద్వారా హ్యాక్ చేశారని, వ్యక్తగత భద్రతకు స్వేచ్ఛ లేకుండా చేశారని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. పెగాసస్, వ్యవసాయ చట్టాల వ్యవహారంతో ఇప్పటికే సభ అనేకసార్లు వాయిదా పడింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top