
దేశంలో కుక్క కాటు ఘటనలు, రేబిస్ మరణాలు పెరిగిపోతున్న వేళ.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జనావాస ప్రాంతాల్లో వీధి కుక్కలు సంచరించడం ఎంతమాత్రం సురక్షితం కాదని అభిప్రాయపడింది. దేశ రాజధాని రీజియన్ నుంచి వీధి శునకాలను షెల్టర్‌లకు తరలించాలని ఆదేశిస్తూ.. ఈ క్రమంలో జంతు ప్రేమిక సంఘాలను తీవ్రంగా హెచ్చరించింది కూడా.
రాజధాని రీజియన్‌లో పసికందులు, వృద్దులుపై వీధి కుక్కల దాడుల ఘటనలపై పలు మీడియా సంస్థలు ఇచ్చాయి. అందులో ఘటనలతో పాటు రేబిస్ బారిన పడి మరణించిన దాఖలాలను ప్రస్తావించాయి. ఈ కథనాల ఆధారంగా.. జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. వీధి కుక్కలను నివాస ప్రాంతాల్లో సంచరించడం ఏమాత్రం యోగ్యం కాదని, వాటిని పట్టుకుని షెల్టర్లకు తరలించాలని, ఇందుకు 8 వారాల గడువు విధిస్తూ అధికార యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో..
ఏదైనా సంస్థలు ఈ చర్యలను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంతేకాదు ఈ వ్యవహారంలో కేవలం కేంద్రం తరఫున వాదనలు మాత్రమే తాము వినదల్చుకుంటున్నామని, శునక ప్రియులు.. జంతు ప్రేమిక సంఘాల నుంచి పిటిషన్లను స్వీకరించబోమని స్పష్టం చేసింది.
వీధికుక్కలను వీలైనంత త్వరగా పట్టుకుని సుదూర ప్రాంతాల్లో వదిలేయండి అని ఈ కేసులో అమీకస్ క్యూరీ అయిన గౌరవ్ అగర్వాలకు కోర్టు సూచించింది. ఈ క్రమంలో చర్యలను జంతు సంఘాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
కుక్క కాటుకు గురైన వాళ్ల కోసం, రేబిస్ బారిన మరణిస్తున్నవాళ్ల కోసం ఈ జంతు సంఘాలు ఏమైనా చేస్తున్నాయా? చనిపోయిన వాళ్లను బతికించి తెస్తున్నాయా?. ఇదేం మా కోసం చేస్తున్నది కాదు. ప్రజల కోసం చేస్తున్నది. కాబట్టి ఇందులో ఎలాంటి సెంటిమెంట్‌కు చోటు ఉండబోదు. ఈ ఆదేశాలను ప్రతిఘటించాలని చూస్తే సత్వర చర్యలు ఉంటాయి జాగ్రత్త’’ అని జస్టిస్ పార్దీవాలా వ్యాఖ్యానించారు. అదే సమయంలో వాటిని దత్తత తీసుకునే ప్రయత్నాలను అంగీకరించబోమని తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన.
ఇదిలా ఉంటే.. ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్‌లోని ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ పరిధిలోని అధికార యంత్రాగాలకు దూరంగా డాగ్ షెల్టర్‌లను నిర్మించాలని, వీధి కుక్కలను వెంటనే అక్కడికి తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
