యూజీసీ నిర్ణయం సరైందే

States can apply to UGC for extension of exam deadline - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా పలు రాష్ట్రాలు ఫైనలియర్‌ పరీక్షలను రద్దు చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. సెప్టెంబర్‌ 30వ తేదీ కల్లా పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాతే విద్యార్థులను పై తరగతులకు అనుమతించాలన్న యూజీసీ నిర్ణయాన్ని సమర్థ్ధించింది. విపత్తు నిర్వహణ చట్టం కింద పరీక్షలను రాష్ట్రాలు వాయిదా వేసుకోవచ్చన్న అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా సెప్టెంబర్‌ 30లోగా పరీక్షలు జరపడం వీలుకాదని భావించే రాష్ట్రాలు, యూజీసీని సంప్రదించి, పరీక్షలకు ప్రత్యామ్నాయ తేదీలను ఖరారు చేసుకోవాలని స్పష్టం చేసింది. చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణ విషయంలో రాష్ట్రాలు, వర్సిటీలు యూజీసీ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలనీ, ఏవైనా మినహాయింపులు ఇవ్వాలనుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాలని జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాల ధర్మాసనం ఆదేశించింది.

పరీక్షల ద్వారానే విద్యార్థుల ప్రతిభ బయటపడుతుందని అభిప్రాయపడింది. రాష్ట్రాలు, వర్సిటీలు ఫైనలియర్‌/ టెర్మినల్‌ పరీక్షలు చేపట్టకుండా విద్యార్థులను తదుపరి తరగతులకు ప్రమోట్‌ చేయజాలవని తెలిపింది. విపత్తు నిర్వహణ చట్టం–2005 చట్టం కింద.. విద్యార్థులకు ఫైనలియర్‌ పరీక్షలు జరపకుండా అంతకుముందు సంవత్సరం ఫలితాలు/అంతర్గత మదింపు ఆధారంగా ప్రమోట్‌ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని తెలిపింది.

పరీక్షలు తప్పనిసరి చేస్తూ జూలై 6వ తేదీన యూజీసీ ఇచ్చి న రివైజ్డు మార్గదర్శకాలు నిపుణుల సూచనల మేరకు చేసినవేననీ, చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదనడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోవిడ్‌ను కారణంగా చూపుతూ మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు వివిధ కోర్సుల ఫైనలియర్‌ పరీక్షలను రద్దు చేయాలంటూ తీసుకున్న నిర్ణయం ఉన్నతవిద్యా ప్రమాణాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతాయని యూజీసీ తెలిపింది.

ఈ చర్య రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనని వాదించింది. కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో పరీక్షలు నిర్వహించాలన్న యూజీసీ మార్గదర్శకాలను సవాలు చేస్తూ శివసేన పార్టీ యువజన విభాగం తదితరులు వేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం పై ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పొఖ్రియాల్‌ నిశాంక్‌ హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలను విద్యకు దూరంగా ఉంచి, రాజకీయ అవగాహన పెంచుకుందామని పిలుపునిచ్చారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top