మేకల దొంగల వీరంగం.. స్పెషల్‌ ఎస్సై హత్య.. రూ.కోటి ఎక్స్‌గ్రేషియా

Special I Assassinated By Goat Thieves In Tamil Nadu - Sakshi

విధుల్లో ఉన్న ఎస్‌ఎస్‌ఐ హత్య

దుండుగల కోసం గాలింపు

మృతుడి కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా 

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

సాక్షి, చెన్నై : తిరుచ్చిలో మేకల దొంగలు వీరంగం సృష్టించారు. తమను పట్టుకునేందుకు వచ్చిన స్పెషల్‌ ఎస్‌ఐను హతమార్చారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ జిల్లా పోలీసులు దుండుగల కోసం జల్లెడ పడుతున్నారు. మృతుడి కుటుంబానికి సీఎం స్టాలిన్‌ రూ. కోటి ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. తిరుచ్చి జిల్లా తిరువేంబూరు సమీపంలోని నవల్‌ పట్టు పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఎస్‌ఐగా భూమినాథన్‌(51) పనిచేస్తున్నారు. భార్య కవిత(46), కుమారుడు గుహనాథన్‌ (22) ఉన్నారు. విధి నిర్వహణలో నిజాయితీ పరుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. తన జీతంలో సగం అనాథాశ్రమాలకు కేటాయించేవారు. శనివారం రాత్రి హెడ్‌ కానిస్టేబుల్‌ చిత్రై వేల్‌తో కలిసి గస్తీలో ఉన్నారు. 
చదవండి: సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కుటుంబంలో విషాదం

మేకల దొంగల కోసం ఛేజింగ్‌ 
చిన్న సూర్యర్‌ గ్రామ శివారులో గస్తీలో ఉండగా మేకల అరుపులను గుర్తించారు. రెండు మోటార్‌ సైకిళ్లపై నలుగురు యువకులు మేకలను దొంగలించి తీసుకెళుతుండడాన్ని గుర్తించారు. వారి కోసం చేజింగ్‌ చేశారు. కొంత దూరం వెళ్లిన  తర్వాత ఆ దొంగలను చిత్రై వేల్‌ చేజింగ్‌ చేయలేకపోయారు. భూమినాథన్‌ వెనుకడుగు వేయకుండా తిరుచ్చి జిల్లా నుంచి పుదుకోటై జిల్లాలోకి ప్రవేశించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

స్టేషన్‌ ఎస్‌ఐ కీరనూర్‌శేఖర్‌కు కాల్‌ చేసి పుదుకోటై పల్లత్తు పట్టి గ్రామ శివారుకు రావాలని కోరారు. అయితే తమ వాళ్లు భూమినాథన్‌కు చిక్కడంతో మిగిలిన ఇద్దరు రెచ్చిపోయారు. కత్తులతో భూమినాథన్‌పై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. కీరనూరు నుంచి శేఖర్‌తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  
చదవండి: వ్యభిచారం కేసులో టీడీపీ నేత అరెస్టు

దుండగుల కోసం గాలింపు 
అప్పటికే ఆయన మృతిచెందడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. డీఐజీ శరవణ సుందర్, తిరుచ్చి ఎస్పీ సుజిత్‌కుమార్, పుదుకోటై ఎస్పీ నిషా పార్థీబన్‌ నేతృత్వంలోని బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. దుండగులు పుదుకోటై జిల్లాకు చెందిన వారై ఉంటారని తేల్చారు. మార్గమధ్యలో ఓ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలో ఈ చేజింగ్‌ దృశ్యాలు వెలుగుచూశాయి. దాని ఆధారంగా ఎనిమిది ప్రత్యేక బృందాలు దుండగుల కోసం గాలిస్తున్నాయి. 

రూ. కోటి ఎక్స్‌గ్రేషియో 
ఎస్‌ఎస్‌ఐ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనను సీఎం ఎంకే స్టాలిన్‌ తీవ్రంగా పరిగణించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. రూ.కోటి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తూ ప్రకటన చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top