భారత్‌ జోడో యాత్ర షురూ.. లేఖ విడుదల చేసిన సోనియా గాంధీ

Sonia Gandhi Pens Letter Amid Congress Bharat Jodo Yatra Begins - Sakshi

సాక్షి, కన్యాకుమారి/ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ను అధికారికంగా మొదలుపెట్టారు.  తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బాఘెల్‌ సమక్షంలో త్రివర్ణ పతాకాన్ని అందుకుని యాత్రను మొదలుపెట్టారాయన. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సభ్యులను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత్రి(తాత్కాలిక) సోనియా గాంధీ ఓ లేఖ రాశారు. 

‘‘కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌ జోడో యాత్రను దేశరాజకీయాల్లో ఒక పరివర్తన ఉద్యమం. చారిత్రక నేపథ్యం ఉన్న కాంగ్రెస్‌కు ఇది ఎంతో ప్రత్యేకమైన సందర్భం. ఈ యాత్రలో దారిపొడవునా పాల్గొనబోతున్న నేతలకు, కార్యకర్తలకు నా అభినందనలు. ప్రత్యేకించి.. 3,600 కిలోమీటర్ల పాదయాత్రలో పూర్తిగా పాల్గొననున్న 120 మంది సభ్యులను అభినందిస్తున్నా. అనారోగ్యం కారణాల వల్ల ఈ కార్యక్రమంలో నేను పాల్గొనలేకపోతున్నా. ఇందుకు నేను చింతిస్తున్నా. కానీ, నా ఆలోచనలన్నీ యాత్ర వెంటే నడుస్తుంటాయి.. నిత్యం యాత్రను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తుంటా. కాంగ్రెస్‌ పార్టీ పునరుజ్జీవనం చెందుతుందని ఆశిస్తున్నా’’ అని లేఖలో ఆమె పేర్కొన్నారు. 

ఇక భారత రాజకీయాలకు ప్రతిష్టాత్మక వేదికగా అభివర్ణించే కన్యాకుమారిలోని మహాత్మా గాంధీ మండపం నుంచి బుధవారం సాయంత్రం కాంగ్రెస్‌ భారత్‌ జోడో యాత్ర ప్రారంభమైంది. గాంధీ మండపం నుండి బీచ్ రోడ్డు వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించారు. జోడో యాత్రలో కాంగ్రెస్‌ నుంచి పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొంటారు.  కన్యాకుమారిలో ప్రారంభమైన యాత్ర కశ్మీర్ లో పూర్తి కానుంది.  తమిళనాడు. కేరళ, కర్ణాటక, తెలంగాణ , మహారాష్ట్రల మీదుగా యాత్ర ముందుకు సాగనుంది.
 

ప్రతి రోజూ రెండు విడతలుగా కాంగ్రెస్‌ భారత్‌ జోడో యాత్ర సాగనుంది. ఉదయం ఏడు గంట నుండి పదిన్నర గంటల వరకు యాత్ర సాగుతుంది. మళ్లీ మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు పాదయాత్ర ఉంటుంది. ప్రతి రోజూ కనీసం 26 కి.మీ. నడవాలని ప్లాన్ చేశారు. అయితే ప్రతి రోజు సగటున 23.5 కి.మీ నడిచేలా రూట్ మ్యాప్ లు సిద్దం చేశారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విభజన రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దేశాన్ని ఏకం చేసేందుకు ఈ యాత్ర దోహద పడుతుందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.  

రాహుల్‌ గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ జోడో యాత్రకు ఊహించని స్పందన లభించింది. జీ-23 నేత, గత కొంతకాలంగా కాంగ్రెస్‌ అధిష్టానంపై అసంతృప్త గళం వినిపిస్తున్న సీనియర్‌ ఆనంద్‌ శర్మ.. రాహుల్‌ గాంధీకి శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు బీజేపీ రథయాత్ర అధికారం కోసమైతే.. కాంగ్రెస్‌ భారత్‌ జోడో యాత్ర మాత్రం సత్యాన్ని పరిరక్షించేందుకు అని కాంగ్రెస్‌ నేత కన్హయ్య కుమార్‌ పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top