దేశ భద్రతపై మౌనమా? కేంద్రాన్ని నిలదీసిన సోనియా గాంధీ

Sonia Gandhi lashes out at government over silence on India-China border issue - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌–చైనా సరిహద్దు అంశంపై పార్లమెంట్‌లో చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత సోనియా గాంధీ మండిపడ్డారు. దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారంపై ప్రభుత్వం మౌనంగా ఉండడం ఏమిటని నిలదీశారు. బుధవారం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తమ ఎంపీలను ఉద్దేశించి సోనియా మాట్లాడారు. మన దేశ భూభాగాన్ని చైనా దురాక్రమిస్తున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం నోరుమెదపడం లేదని ఆరోపించారు. పార్లమెంట్‌లో చర్చిద్దామని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. దేశ రక్షణ, సరిహద్దు పరిస్థితిపై దేశ ప్రజలకు నిజాలు చెప్పాలిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. తన చర్యలు, విధానాలు ఏమిటో కూడా చెప్పాలన్నారు.   
 
క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?   

దేశ సరిహద్దును చైనా సైన్యం ఉల్లంఘిస్తుండడం అత్యంత ఆందోళనకరమైన అంశమని సోనియా గాంధీ పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ చైనా సైన్యం దాడులను సమర్థంగా తిప్పికొడుతున్న మన జవాన్లకు మన దేశం యావత్తూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దేశ భద్రతకు సవాలు ఎదురైనప్పుడు పార్లమెంట్‌ను విశ్వాసంలోకి తీసుకోవడం ఒక ఆనవాయితీ అని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం మాత్రం అందుకు సిద్ధంగా లేదని ఆక్షేపించారు. పార్లమెంట్‌లో చర్చ జరగకపోవడం వల్ల రాజకీయ పార్టీలకు, ప్రజలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేమిటో తెలియడం లేదన్నారు.  దేశంలో విభజన రాజకీయాలు, సమాజంలో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం, విద్వేషాలు రెచ్చగొట్టడం వంటివి కొనసాగుతున్నాయని, దీనివల్ల విదేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదిరించడం మన దేశానికి కష్టతరం అవుతుందని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థను చట్టం పరిధి నుంచి తప్పించేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. జ్యుడీషియరీని పలుచన చేయొద్దని సూచించారు.  

‘చైనా’పై చర్చ జరగాల్సిందే
పార్లమెంటు ఆవరణలో విపక్షాల ధర్నా
మీ హయాంలో చర్చించారా?: కేంద్రం

న్యూఢిల్లీ:  చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని విపక్షాలన్నీ మరోసారి డిమాండ్‌ చేశాయి. కాంగ్రెస్‌ నేత సోనియాగాంధీ సారథ్యంలో బుధవారం పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నేతలు, డీఎంకే, శివసేన, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీ(యూ), వామపక్షాలతో సహా 12 విపక్షాల ఎంపీలు పాల్గొన్నారు. ‘‘ప్రధాని మోదీ మౌనం వీడాల్సిందే. చైనా దురాక్రమణ యత్నాలపై మా ప్రశ్నలకు సభలో బదులిచ్చి తీరాల్సిందే’’ అని వారంతా నినదించారు. అయితే ఆ డిమాండ్‌ను కేంద్రం మరోసారి తోసిపుచ్చింది. యూపీఏ హయాంలో ఇలాంటి అంశాలను సభలో చర్చకు తాము డిమాండ్‌ చేస్తే ఇవ్వలేదని కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్‌ రిజిజు అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top