
న్యూఢిల్లీ: మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. హింసాత్మక సంఘటనలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, వేలాది మంది నిరాశ్రయులు కావడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఇన్నాళ్లూ అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ప్రజలే నేడు శత్రువులుగా మారిపోవడం చాలా విచారకరమని అన్నారు. భిన్న వర్గాల ప్రజలను ఆప్యాయంగా అక్కున చేర్చుకున్న ఘన చరిత్ర మణిపూర్‌కు ఉందన్నారు.
ఈ మేరకు బుధవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. రాష్ట్రంలో అందరూ సహనం వహించాలని విజ్ఞప్తి చేశారు. హింసకు తక్షణమే తెరపడాలని, శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. మృతులకు సంతాపం ప్రకటించారు. ఆప్తులను కోల్పోయినవారికి సానుభూతి తెలిపారు. మణిపూర్ హింసాకాండలో ఇప్పటిదాకా 100 మందికిపైగా మరణించినట్లు సమాచారం. వేలాది మంది సొంత ఊళ్లను వదలేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.