
ఎముక ఆరోగ్యం, రేడియోధార్మీకతపై పరిశోధన
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కు చేరుకున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తన విధుల్లో బిజీగా మారారు. ఒకరోజు విశ్రాంతి తర్వాత తన ‘ఐఎస్‌ఎస్ పదోరోజు’పనుల్లో భాగంగా సూక్ష్మ గురుత్వాకర్షణ స్థితిలో మనిషి ఎముకల సాంద్రత ఎలా ఉంటుంది? అనే అంశంపై ఆయన పరిశోధనలు మొదలుపెట్టారు. భారరహిత స్థితిలో ఎముకలో కణాల పుట్టుక, అభివృద్ధి, వాపు అంశాలపైనా శుక్లా శోధన సాగించారు.
దీర్ఘకాలంపాటు ఖగోళయానం చేస్తే రేడియోధార్మీకత కారణంగా వ్యోమగాముల కణాల్లో డీఎన్‌ఏ నిచ్చెనలు దెబ్బతింటే అవి మళ్లీ మరమ్మతులు చేసుకోవాలంటే భూమి గురుత్వాకర్షణ అవసరం. కానీ ఐఎస్‌ఎస్‌లో అత్యంత స్వల్పస్థాయిలో గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అలాంటప్పుడు రేడియేషన్ ప్రభావ స్థాయిలు ఎలా ఉంటాయనే దానిపై శుక్లా అధ్యయనం మొదలెట్టారు.
నీటి ఎలుగుబంటి(టార్డీగ్రేడ్)తోపాటు శైవలాలు శూన్యస్థితిలో ఎలా పెరగగలవు? అనే అంశంపై ప్రయోగంచేశారు. వాటర్‌బేర్‌ల ఉనికి, పునరుజ్జీవం, పునరుత్పత్తి విధానాల్లో మార్పులను ఆయన గమనించారు. ఈ సూక్ష్మజీవాలు భవిష్యత్తులో సుస్థిర జీవనానికి, ఆహారం, ఇంధనంతోపాటు పీల్చేగాలికి ఊపిరులూదొచ్చు. అయితే తొలుత భారరహిత స్థితిలో ఈ అతిసూక్ష్మజీవాలు ఎలా మనుగడ సాగిస్తాయో తెల్సుకోవాల్సి ఉంది’’అని యాగ్జియం స్పేస్ సంస్థ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.
‘‘శుక్లాతోపాటు యాగ్జియం బృంద సభ్యులు ఎముక శూన్యంలో ఎలా పెళుసుబారుతుంది? భూమి మీదకు రాగానే ఎలా పూర్వస్థితిని చేరుకుంటుంది? అనే దానిపైనా ప్రయోగంచేశారు. ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధ వ్యాధులకు మరింత మెరుగైన చికిత్సావిధానాల అభివృద్ధికి తాజా ప్రయోగాలు దోహదపడతాయి’’అని యాగ్జియం స్పేస్ తెలిపింది.
శూన్య స్థితిలో అస్థిపంజరంలోని కండరాలు ఎందుకు సూక్ష్మస్థాయిలో స్థానభ్రంశం చెందుతాయనే అంశంపైనా శుక్లా పరిశోధన చేశారు. చాలా రోజులపాటు అంతరిక్షయాత్రల్లో భాగంగా ఐఎస్‌ఎస్‌లో గడిపే వ్యోమగాములను కండరాల క్షీణత పట్టిపీడిస్తుంది. దీనికి కణస్థాయిలో పరిష్కారం కనుగొనేందుకు శుక్లా ప్రయత్నించారు.