
కర్ణాటక: దెయ్యం పట్టిందని తీవ్రంగా హింసించడంతో ఓ మహిళ మరణించిన ఘటన జిల్లాలోని భద్రావతి తాలూకా హొళెహొన్నూరు సమీపంలోని జంబరగట్టె గ్రామంలో జరిగింది. మృతురాలు గీతమ్మ (55). వివరాలు.. ఆదివారం సాయంత్రం మృతురాలు గీతమ్మ అసహజంగా ప్రవర్తించింది. ఆమె కుమారుడు సంజయ్ అదే గ్రామానికి చెందిన నిందితురాలు ఆశ (45)ను ఇంటికి పిలిపించాడు. గీతమ్మకు దెయ్యం పట్టిందని, విడిపిస్తానని ఆశా చెప్పింది.
ఆశా తనకు చౌడమ్మ దేవి పూనిందంటూ గీతమ్మకు పట్టిన దెయ్యం వదిలిపో అంటూ చర్నాకోలు తీసుకుని కొట్టడం ప్రారంభించింది. రాత్రి 9.30 గంటలకు ఇంటి నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న హళేజంబర ఘట్టె చౌడమ్మ గుడి వరకు ఇలాగే కొట్టుకుంటూ తీసుకెళ్లింది. అయినా దెయ్యం వదిలిపోలేదంటూ తెల్లవారుజామున 2.30 గంటల వరకు చితకబాదుతూనే ఉంది.
దాడితో తీవ్రంగా అస్వస్థురాలైన గీతమ్మ కుప్పకూలింది. దయ్యం వదలడం ఏమో గానీ ఆమె ప్రాణం వదిలిపోయింది. ఆమె స్పృహ తప్పి పడిపోయిందనుకున్న ఆశ.. ఎలాంటి ఇబ్బంది లేదు. అంతా సర్దుకుంటుంది అని చెప్పి వెళ్లిపోయింది. కళ్లు తెరవకపోవడంతో కొడుకు గీతమ్మను హొళెహొన్నూరులోని సముదాయ ఆస్పత్రికి తరలించగా చనిపోయిందని వైద్యులు తెలిపారు. గీతమ్మకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. కాగా గీతమ్మపై జరిగిన దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు ఆశను అరెస్టు చేశారు.