6 కోట్ల డోసుల టీకా కొనుగోలుకు కేంద్రం ఉత్తర్వులు

Serum Institute Gets Covishield Purchase Order From Centre - Sakshi

కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లకు కొనుగోలు ఉత్తర్వులు

రెండు టీకాలు కలిపి రూ.1,300 కోట్లు 

మంగళవారం ఉదయం నుంచి టీకా సరఫరా ప్రారంభం

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చిన కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాల 6 కోట్ల డోసుల కొనుగోలుకు కేంద్రం సోమవారం ఆర్డర్‌ ఇచ్చింది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) తయారు చేస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా కోవిషీల్డ్‌ను మొదటి విడతలో 1.1 కోట్ల డోసులు, రెండో విడతలో ఏప్రిల్‌ కల్లా మరో 4.5 కోట్ల డోసులు కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా, భారత్‌ బయోటెక్‌ టీకా కోవాగ్జిన్‌ను రూ.162 కోట్ల విలువైన 55 లక్షల డోసులను కొనుగోలు చేస్తోంది. ఇందుకు గాను మొత్తం రూ.1,300 కోట్లు వెచ్చిస్తోంది.

తయారీ కేంద్రాల నుంచి టీకా డోసుల సరఫరా మంగళవారం ఉదయం నుంచి ప్రారంభం కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తరఫున ప్రభుత్వ రంగ హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌ నుంచి అడిషనల్‌ డైరెక్టర్‌ ప్రకాశ్‌ కుమార్‌ సింగ్‌ పేరిట ఈ కొనుగోలు ఆర్డర్‌ జారీ అయింది. టీకా ఒక్కో డోసు ఖరీదు రూ.200 కాగా, జీఎస్‌టీతో రూ.10 కలుపుకుని డోసు ఖరీదు మొత్తం రూ.210 అని ఆ అందులో పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా గుర్తించిన 60 పాయింట్లకు టీకా డోసులు సరఫరా అవుతాయి. అక్కడి నుంచి వివిధ పంపిణీ కేంద్రాలకు దానిని చేరవేస్తారు. ఢిల్లీలోని తహిర్‌పూర్‌లో ఉన్న రాజీవ్‌గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ స్టోరేజీ పాయింట్‌కు 2,54,500 డోసుల కోవిషీల్డ్‌ టీకా చేరనుందని అధికారులు తెలిపారు. పుణేలోని మంజరి వద్దనున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ కేంద్రం నుంచి వ్యాక్సిన్‌ తీసుకెళ్లే ట్రక్కులకు రాష్ట్ర సరిహద్దుల వరకు, విమానాశ్రయాల వరకు మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసు భద్రత కల్పిస్తోంది. ఇమ్యునైజేషన్‌ ప్రక్రియలో భాగంగా ఈ టీకాను వ్యక్తులకు 28 రోజుల వ్యవధిలో రెండు డోసులుగా ఇస్తారు.

స్వచ్ఛందంగా వేయించుకోండి
వ్యాక్సిన్‌ను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వేయించు కోవాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) తన 3.5 లక్షల మంది సభ్యులకు పిలుపునిచ్చింది. సంపూర్ణ శాస్త్రీయ విశ్లేషణ, నిపుణుల బృందం నివేదికల పరిశీలన, ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్‌వోలతో చర్చల అనంతరం ప్రభుత్వం చేపట్టే కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నిర్ణయించినట్లు తెలిపింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలను దేశీయ వాతావరణ పరిస్థితుల్లో నిల్వ ఉంచడం, వినియోగించడం సులువని వివరించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top