కశ్మీర్‌ ఉగ్రవాదుల చేతుల్లో శాటిలైట్‌ ఫోన్లు

Satellite phones in the hands of Kashmir terrorists - Sakshi

వైఫై ఆధారిత ధర్మల్‌ ఇమేజరీ పరికరాలు

అఫ్గాన్‌లో అమెరికా బలగాలు వదిలి వెళ్లినవేనంటున్న నిఘా వర్గాలు

శ్రీనగర్‌: అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలు వదిలేసి వెళ్లిన అత్యాధునిక సామగ్రి కశ్మీర్‌ ఉగ్రవాదుల చేతుల్లోకి వచ్చాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఉగ్రవాదుల స్థావరాలపై జరిపిన దాడుల్లో ఇరిడియమ్‌ శాటిలైట్‌ ఫోన్లు, థర్మల్‌ ఇమేజరీ సామగ్రి దొరకడంతో ఈ మేరకు అనుమానాలు నిజమయ్యాయి. ఉత్తరకశ్మీర్‌ ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 15వరకు శాటిలైట్‌ ఫోన్‌ సంకేతాల జాడలు కనిపించగా, తాజాగా దక్షిణ కశ్మీర్‌లోనూ గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ఇవి ఉన్నట్లు తేలిందని అంటున్నారు.

అదేవిధంగా, రాత్రి సమయాల్లో భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు ఉపయోగపడే వైఫై ఆధారిత థర్మల్‌ ఇమేజరీ సామగ్రి  ఉగ్రస్థావరాల్లో లభ్యమైంది. శరీర ఉష్ణోగ్రతల ఆధారంగా సమీపంలో ఉన్న భద్రతా సిబ్బంది ఉనికిని ఈ పరికరం గుర్తించి హెచ్చరికలు చేస్తుంది. ఉగ్రవాది దాక్కున్న ప్రాంతం వెలుపలి ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఈ పరికరాలు అఫ్గానిస్తాన్‌లో దశాబ్దాలపాటు తిష్టవేసిన అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు వాడినవేనని తెలిపారు.

అనంతరం వీటిని తాలిబన్లు, ఇతర ఉగ్రసంస్థలు చేజిక్కించుకుని, కశ్మీర్‌ ఉగ్రవాదులకు అందజేసి ఉంటారని అధికారులు అంటున్నారు. అయితే, వీటిని గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. శాటిలైట్‌ ఫోన్‌ జాడలను నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఎన్‌టీఆర్‌వో), డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ(డీఐఏ)లు ఎప్పటికప్పుడు కనిపెట్టే పనిలోనే ఉన్నాయన్నారు. అదేవిధంగా, థర్మల్‌ ఇమేజరీ పరికరాలను పనిచేయకుండా ఆపేందుకు భద్రతా బలగాలు జామర్లను ఉపయోగిస్తున్నాయని అన్నారు. వీటిని వినియోగించే వారిని త్వరలో పట్టుకుంటామని చెప్పారు. దేశంలో శాటిలైట్‌ ఫోన్ల వినియోగంపై కేంద్రం 2012లో పూర్తి నిషేధం విధించింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top