breaking news
Thermal Images
-
కశ్మీర్ ఉగ్రవాదుల చేతుల్లో శాటిలైట్ ఫోన్లు
శ్రీనగర్: అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలు వదిలేసి వెళ్లిన అత్యాధునిక సామగ్రి కశ్మీర్ ఉగ్రవాదుల చేతుల్లోకి వచ్చాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఉగ్రవాదుల స్థావరాలపై జరిపిన దాడుల్లో ఇరిడియమ్ శాటిలైట్ ఫోన్లు, థర్మల్ ఇమేజరీ సామగ్రి దొరకడంతో ఈ మేరకు అనుమానాలు నిజమయ్యాయి. ఉత్తరకశ్మీర్ ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 15వరకు శాటిలైట్ ఫోన్ సంకేతాల జాడలు కనిపించగా, తాజాగా దక్షిణ కశ్మీర్‌లోనూ గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ఇవి ఉన్నట్లు తేలిందని అంటున్నారు. అదేవిధంగా, రాత్రి సమయాల్లో భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు ఉపయోగపడే వైఫై ఆధారిత థర్మల్ ఇమేజరీ సామగ్రి ఉగ్రస్థావరాల్లో లభ్యమైంది. శరీర ఉష్ణోగ్రతల ఆధారంగా సమీపంలో ఉన్న భద్రతా సిబ్బంది ఉనికిని ఈ పరికరం గుర్తించి హెచ్చరికలు చేస్తుంది. ఉగ్రవాది దాక్కున్న ప్రాంతం వెలుపలి ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఈ పరికరాలు అఫ్గానిస్తాన్‌లో దశాబ్దాలపాటు తిష్టవేసిన అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు వాడినవేనని తెలిపారు. అనంతరం వీటిని తాలిబన్లు, ఇతర ఉగ్రసంస్థలు చేజిక్కించుకుని, కశ్మీర్ ఉగ్రవాదులకు అందజేసి ఉంటారని అధికారులు అంటున్నారు. అయితే, వీటిని గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. శాటిలైట్ ఫోన్ జాడలను నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఎన్టీఆర్వో), డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(డీఐఏ)లు ఎప్పటికప్పుడు కనిపెట్టే పనిలోనే ఉన్నాయన్నారు. అదేవిధంగా, థర్మల్ ఇమేజరీ పరికరాలను పనిచేయకుండా ఆపేందుకు భద్రతా బలగాలు జామర్లను ఉపయోగిస్తున్నాయని అన్నారు. వీటిని వినియోగించే వారిని త్వరలో పట్టుకుంటామని చెప్పారు. దేశంలో శాటిలైట్ ఫోన్ల వినియోగంపై కేంద్రం 2012లో పూర్తి నిషేధం విధించింది. -
‘విక్రమ్’ను గుర్తించాం!
బెంగళూరు/వాషింగ్టన్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ కె.శివన్ కీలక ప్రకటన చేశారు. చంద్రయాన్–2 ప్రయోగంలో భాగంగా జాబిల్లిపై దూసుకెళుతూ భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయిన ‘విక్రమ్’ ల్యాండర్‌ను గుర్తించామని తెలిపారు. చందమామ చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌కు అమర్చిన కెమెరాలు ‘విక్రమ్’కు సంబంధించిన థర్మల్ ఇమేజ్‌లను చిత్రీకరించాయని వెల్లడించారు. ఈ చిత్రాలను చూస్తే విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ అయినట్లు (చంద్రుడిపై పడిపోయినట్లు) అనిపిస్తోందని వ్యా ఖ్యానించారు. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, అండ్ కమాండ్ నెట్వర్క్ కేంద్రంలో శివన్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విక్రమ్ ల్యాండర్ దెబ్బతిందా? అన్న మీడియా ప్రశ్నకు..‘ఆ విషయంలో మాకు స్పష్టత లేదు. ల్యాండర్ లోపలే రోవర్ ప్రజ్ఞాన్ ఉంది’ అని జవాబిచ్చారు. ఇస్రో ఈ ఏడాది జూలై 22న జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా చంద్రయాన్–2ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. అయితే గత శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ చంద్రుడివైపు నెమ్మదిగా కదిలింది. మరో 2.1 కి.మీ ప్రయాణిస్తే ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలాన్ని తాకుతుందనగా, భూకేంద్రంతో ఒక్కసారిగా సంబంధాలు తెగిపోయాయి. సమయం మించిపోతోంది.. చంద్రయాన్–2లో భాగంగా ప్రయోగించిన ‘విక్రమ్’ ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు సమయం మించిపోతోందని ఇస్రో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాలు పునరుద్ధరించే అవకాశాలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. ఈ విషయంలో ఆలస్యమయ్యేకొద్దీ విక్రమ్‌తో కమ్యూనికేషన్ వ్యవస్థల్ని పునరుద్ధరించడం కష్టమైపోతుంది. ఇప్పటికైనా ల్యాండర్ సరైన దిశలో ఉంటే సోలార్ ప్యానెల్స్ సాయంతో చార్జింగ్ చేసుకోగలదు. అయితే ఇది జరిగే అవకాశాలున్నట్లు కనిపించడం లేదు’ అని వ్యాఖ్యానించారు. చంద్రుడిపై సురక్షితంగా దిగేలా విక్రమ్‌ను రూపొందించామనీ, అయితే జాబిల్లి ఉపరితలాన్ని వేగంగా తాకడం కారణంగా ల్యాండర్ దెబ్బతిని ఉండొచ్చని మరో ఇస్రో శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు. ఇస్రో రూ.978 కోట్ల వ్యయంతో చంద్రయాన్–2 ప్రయోగాన్ని చేపట్టింది. ఇందులో జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ కోసం రూ.375 కోట్లు, ఆర్బిటర్–ల్యాండర్–రోవర్ కోసం రూ.603 కోట్లు వెచ్చించింది. మరోవైపు విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లు శివన్ తెలిపారు. ఇస్రో ప్రయోగించిన ఆర్బిటర్‌లో 8 సాంకేతిక పరికరాలు ఉన్నాయనీ, ఇవి చంద్రుడి ఉపరితలాన్ని మ్యాపింగ్ చేయడంతో పాటు బాహ్య వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయని వెల్లడించారు. దేశ ప్రజలకు ఇస్రో కృతజ్ఞతలు.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–2 ప్రయోగంలో ఒడిదుడుకులు ఎదురైనా ప్రధాని మోదీతో పాటు యావత్ భారతం తమవెంట నిలవడంపై ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయమై శివన్ మాట్లాడుతూ..‘ప్రధాని మోదీతో పాటు దేశమంతా మాకు అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ చర్య శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల నైతిక స్థైర్యాన్ని అమాంతం పెంచింది’ అని తెలిపారు. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ స్పందిస్తూ..‘భారత ప్రజలు చూపిన సానుకూల దృక్పథంతో మేం కదిలిపోయాం. ఇస్రో చైర్మన్ శివన్, ఇతర శాస్త్రవేత్తల్ని వెన్నుతట్టి ప్రోత్సహించే విషయంలో ప్రధాని గొప్పగా ప్రవర్తించారు’ అని వ్యాఖ్యానించారు. ఈ ల్యాండింగ్ ప్రక్రియ ఎంత సంక్లిష్టమైనదో ప్రజలు గుర్తించి తమకు మద్దతుగా నిలవడం సంతోషంగా ఉందని ఇస్రోకు గతంలో చైర్మన్‌గా పనిచేసిన ఏఎస్ కిరణ్‌కుమార్ వెల్లడించారు. ఇందుకోసం తాము దేశానికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ‘ఇస్రో’పై అమెరికా ప్రశంసలు.. ఇస్రో చేపట్టిన చంద్రయాన్–2 ప్రయోగంపై అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రశంసలు కురిపించింది. ఈ ప్రయోగంతో తాము స్ఫూర్తి పొందామనీ, ఇస్రోతో కలిసి సౌర వ్యవస్థను అధ్యయనం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ప్రకటించింది. ఈ విషయమై నాసా స్పందిస్తూ.. ‘అంతరిక్ష ప్రయోగాలు అన్నవి చాలా సంక్లిష్టమైనవి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగేందుకు ఇస్రో చేపట్టిన చంద్రయాన్–2ను స్వాగతిస్తున్నాం’ అని తెలిపింది. ఇస్రో చేపట్టిన ప్రయోగం అద్భుతమనీ, దీనివల్ల శాస్త్రీయ పరిశోధనలు మరింత వేగవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తంచేసింది. చంద్రుడిపై దిగే తొలిప్రయత్నంలో ఇండియా విజయవంతం కాకపోయినా భారత ఇంజనీరింగ్ నైపుణ్యం, సామర్థ్యం ఏంటో చంద్రయాన్–2తో ప్రపంచం మొత్తానికి తెలిసిందని ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రశంసించింది. అమెరికా చేపట్టిన ‘అపోలో మిషన్’తో పోల్చుకుంటే ఎంతో చవకగా కేవలం 141 మిలియన్ డాలర్ల వ్యయంతోనే భారత్ చంద్రయాన్–2 చేపట్టిందని వాషింగ్టన్ పోస్ట్ వ్యాఖ్యానించింది. -
సరిహద్దులో దాడుల వీడియో విడుదల
-
సరిహద్దులో దాడుల వీడియో విడుదల
జమ్మూకశ్మీర్: దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత బలగాలు దీటైన సమాధానం చెబుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ బలగాలు కాల్పులకు తెగబడటంతో బీఎస్ఎఫ్ దళాలు సమర్థంగా ఎదుర్కొన్నాయి. అయితే ఈ ఘటనకు ముందు రోజే కథువా జిల్లాలో ఆరుగురు ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన థర్మల్ ఇమేజెస్‌ను బీఎస్ఎఫ్ విడుదల చేసింది. బీఎస్ఎఫ్ ఔట్‌పోస్ట్‌లపై బాంబులు విసురుతూ, ఆ తర్వాత జవానులు జరిపిన కాల్పుల నుంచి తప్పించుకోవడానికి వారు కిందకు వంగుతూ, సమయం చూసి తిరిగి దాడులకు పాల్పడుతున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. శుక్రవారం ఉదయం 9.35 గంటల సమయంలో కథువా జిల్లా హిరానగర్ సెక్టార్లో భారత ఔట్‌పోస్ట్‌లపై పాక్ రేంజర్లు స్నైపర్ దాడులు జరిపారని బీఎస్ఎఫ్ తెలిపింది. దీంతో భారత బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయని, ఏడుగురు పాక్ రేంజర్లు, ఓ ఉగ్రవాది మరణించారని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ఇదే ప్రాంతంలో అంతకుముందు పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ గుర్నామ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడని, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. గుర్నామ్ సింగ్‌ను జమ్మూలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించి చికి త్స అందజేస్తున్నట్టు చెప్పారు.