మేం ఎన్నికల్లో పాల్గొనడం లేదు

Samyukta Kisan Morcha would not contest Assembly polls - Sakshi

సంయుక్త కిసాన్‌ మోర్చా స్పష్టీకరణ

చండీగఢ్‌: పంజాబ్‌ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) స్పష్టం చేసింది. అదేవిధంగా, రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్న పంజాబ్‌లోని 22 సంఘాల కూటమి ‘సంయుక్త సమాజ్‌ మోర్చా’ఎస్‌కేఎం పేరు వాడుకోరాదని పేర్కొంది. కేవలం రైతు సమస్యల సాధన కోసం దేశవ్యాప్తంగా ఉన్న 475 వేర్వేరు సంస్థలతో ఏర్పడిన వేదిక ఎస్‌కేఎం కాగా, పంజాబ్‌లోని 32 రైతు సంఘాలు అందులో ఒక భాగమని పేర్కొంటూ ఎస్‌కేఎం నేతలు దర్శన్‌ సింగ్‌ పాల్, జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక వేళ ఎస్‌కేఎం పేరును ఎవరైనా వాడుకుంటే చట్టపరంగా ముందుకు వెళతామన్నారు. ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత ఉద్యమాన్ని వాయిదా వేసినట్లు వారు చెప్పారు. రైతుల ఇతర డిమాండ్లపై తదుపరి కార్యాచరణను జనవరి 15న ఖరారు చేస్తామన్నారు.

పంజాబ్‌లో రైతు సంఘాల రాజకీయ వేదిక
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు నిరసనలు సాగించిన పంజాబ్‌లోని 22 రైతు సంఘాలు రాజకీయ కూటమిగా ఏర్పడ్డాయి. రాజకీయ మార్పే లక్ష్యంగా రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని శనివారం ప్రకటించాయి. పంజాబ్‌లోని మొత్తం 32 రైతు సంఘాలకు గాను 22 రైతు సంఘాల ప్రతినిధులు శనివారం ఇక్కడ సమావేశమయ్యారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సంయుక్త సమాజ్‌ మోర్చా పేరుతో పోటీ చేస్తామని భేటీ అనంతరం రైతు నేత హర్మీత్‌ సింగ్‌ కడియన్‌ మీడియాకు తెలిపారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌(రాజేవాల్‌) నేత బల్బీర్‌ సింగ్‌ సింగ్‌ రాజేవాల్‌ తమ మోర్చాకు నేతగా ఉంటారన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీతో జట్టుకట్టే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎన్నికల్లో ఎస్‌కేఎం పేరును మాత్రం వాడుకోబోమన్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top