అఖిలేష్‌ పార్టీకి ఎదురు దెబ్బ.. ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు, ఇది రెండోసారి!

Samajwadi Party MLA Abdullah Azam Khan Disqualified - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అబ్దుల్లా అజాం ఖాన్‌పై అనర్హత వేటు వేస్తున్నట్లు యూపీ అసెంబ్లీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం అసెంబ్లీ సీనియర్‌ అధికారి ఒకరు ప్రకటన విడుదల చేశారు. 

పదిహేనేళ్ల కిందటి నాటి కేసులో(2008).. సువార్ నియోజకవర్గం ఎమ్మెల్యే అబ్దుల్లా అజాం ఖాన్‌కు మోరాదాబాద్‌ కోర్టు రెండేళ్ల శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తీర్పు వెలువడిన ఫిబ్రవరి 13వ తేదీ నాటి నుంచి అబ్దుల్లాపై అనర్హత వేటు అమలులోకి వస్తుంది అంటూ అసెంబ్లీ సెక్రెటరీ పేరిట ప్రకటన వెలువడింది. అబ్దుల్లా అజాం ఖాన్‌ ఎవరో కాదు.. ఎస్పీ దిగ్గజనేత,  వివాదాస్పద అజాం ఖాన్‌ తనయుడు.

ఏం జరిగిందంటే..
డిసెంబరు 31, 2007న రాంపూర్‌లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SEPF) క్యాంపుపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో.. యూపీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. అయితే  2008, జనవరి 29వ తేదీన అజాం ఖాన్‌, అబ్దుల్లా ఖాన్‌లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ని తనిఖీ చేయడం కోసం పోలీసులు ఆపారు. దీనిని నిరసిస్తూ.. జాతీయ రహదారిపై ప్రదర్శన చేపట్టారు తండ్రీకొడుకులు. అయితే.. అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ వీళ్లిద్దరిపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులోనే మోరాదాబాద్‌ కోర్టు తాజాగా ఇద్దరినీ దోషులుగా తేలుస్తూ.. రెండేళ్ల శిక్షలు ఖరారు చేసింది.  మరో విశేషం ఏంటంటే.. ఎమ్మెల్యేగా అనర్హత వేటు ఎదుర్కొవడం అబ్దుల్లా అజాం ఖాన్‌కు ఇది రెండోసారి. 

2017 అసెంబ్లీ ఎన్నికల్లో సువార్ నియోజకవర్గంలో ఎస్పీ తరపున పోటీ చేసి నెగ్గాడు అబ్దుల్లా అజాం ఖాన్‌. అయితే.. అప్పటికీ ఎమ్మెల్యేగా అర్హత వయసు(25 సంవత్సరాలు) నిండకుండానే నామినేషన్స్‌ దాఖలు చేశాడు అతను. ఈ పంచాయితీ కోర్టుకు ఎక్కింది. దీంతో..  2020లో.. అలహాబాద్‌ హైకోర్టు అతని ఎన్నికను రద్దు చేసింది. అయితే తిరిగి 2022 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి నెగ్గాడు అబ్దుల్లా అజాం ఖాన్‌.

చట్ట సభ్యులెవరైనా సరే రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల జైలు శిక్ష గనుక పడితే.. వాళ్ల సభ్యత్వంపై అనర్హత వేటు పడుతుంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top