సాక్షి, హైదరాబాద్: మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు పార్టీ మారారనడానికి తగిన ఆధారాలు లేవన్న స్పీకర్.. వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్లు స్పీకర్ తీర్పు వెలువరించారు. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే తీర్పు స్పీకర్ ఇచ్చారు. ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు పెండింగ్‌లో ఉంది. త్వరలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కేసులో కూడా స్పీకర్ తీర్పు చెప్పనున్నారు.
పది మంది ఎమ్మెల్యేలలో.. ఐదుగురిపై దాఖలైన పిటిషన్లను శాసనసభ స్పీకర్ ఇదివరకే కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో ఇద్దరి వ్యవహారంపై తీర్పు ఇచ్చారు. తమ పార్టీ సింబల్‌పై నెగ్గిన ఎమ్మెల్యేలు కాలె యాదయ్య(చేవెళ్ల), పోచారం శ్రీనివాసరెడ్డి(బాన్సువాడ)లు ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై స్పీకర్ తీర్పు ఇచ్చారు.
మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో సంజయ్(జగిత్యాల) కాకుండా దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్‌పూర్) ఇప్పటిదాకా స్పీకర్‌ను కలిసి వివరణ ఇచ్చుకోలేదు. దీంతో వీళ్ల విషయంలో ఎలాంటి తీర్పు ఉంటుందనే ఆసక్తి కొనసాగుతోంది.
అంతకు ముందు.. గత నెలలో(డిసెంబర్ 17న) ఆరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి), తెల్లం వెంకట్రావు(ఖమ్మం), గూడెం మహిపాల్ రెడ్డి(పటాన్‌చెరు), బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(గద్వాల్), టి. ప్రకాశ్ గౌడ్(రాజేంద్రనగర్) పిటిషన్లను స్పీకర్ కొట్టిపారేశారు.


