VIDEO: బడిలో అమాయకంగా పాడాడు.. రెండేళ్ల తర్వాత సెన్సేషన్‌ అయ్యాడు

Sahdev Dirdo Chhattisgarh Kid Who Viral With Bachpan Ka Pyaar Video - Sakshi

Viral Kid Sahdev Dirdo: సోషల్‌ మీడియా ఎప్పుడు.. ఎవరిని.. ఎలా ఫేమస్‌ చేస్తుందో ఊహించడం కష్టం. అయితే సానుకూల ధోరణి,  లేదంటే వ్యతిరేక విమర్శలతోనైనా సరే పాపులర్‌ అయిపోతుంటారు. ఇక దక్కిన పాపులారిటీని నిలబెట్టుకోలేక కనుమరుగు అయ్యేవాళ్లే ఎక్కువగా ఉంటారు. ఇదిలా ఉంటే ‘ జానే మేరీ జానేమన్‌.. బస్‌పన్‌ క్యా ప్యార్‌ మేరా..’ అంటూ ఓ సాంగ్‌ రీమిక్స్‌ వెర్షన్‌ నార్త్‌ ఇండియాను తెగ ఊపేస్తోంది. కారణం ఈ పాటను  యూనిఫాల్‌లో ఉన్న సహదేవ్‌ అనే  పిలగాడు అమాయకంగా పాడడమే. 

రాయ్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లా చింద్‌ఘడ్‌కు చెందిన సహదేవ్‌ డిర్దో(14).. ఈ కుర్రాడు నార్త్‌ ఇండియాలో ఇప్పుడు ఇంటర్నెట్‌ స్టార్‌. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ పిల్లాడి వీడియో మొత్తం దేశానికి చేరింది. ఆపై రీమిక్స్‌తోడై  సోషల్‌ మీడియా ఊగిపోతోంది. టీవీ షోల దగ్గరి నుంచి ఫిల్మ్‌సెలబబ్రిటీల దాకా ఈ చిన్నారి గాత్రాన్ని ఎక్కించేసుకున్నారు. బుల్లితెర రియాలిటీ షోలు అయితే ప్రతీరోజూ ఈ పాటను వాడేసుకుంటున్నాయి.  చివరికి ఆ చిన్నారి టాలెంట్‌-దక్కిన ఫేమ్‌కి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ సైతం ఫిదా అయ్యారు. సహదేవ్‌ను పిలిపించుకుని ఘనంగా సన్మానించారు కూడా. ఇంతకీ రెండేళ్ల క్రితం ఆ పిలగాడు పాడిన పాట ఎలా వైరల్‌ అయ్యిందంటే.. 

కమలేష్‌ బారోత్‌ అనే ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ సింగర్‌ కమ్‌ ఆర్టిస్ట్‌ కంపోజ్‌ చేసిన ‘బచ్‌పన్‌ కా ప్యార్‌’ సాంగ్‌ 2019లో యూట్యూబ్‌లో రిలీజ్‌ అయ్యింది. నార్త్‌లో రూరల్‌ జనాలకు బాగా కనెక్ట్‌ అయ్యింది ఈ పాట. ఆ టైంలో స్కూల్‌లో తన టీచర్‌ కోసం ‘బచ్‌(స్‌)పన్‌ క్యా ప్యార్‌’ అంటూ  పాడేశాడు ఏడో తరగతి చదివే సహదేవ్‌. ఆ పాట ఆ టీచర్‌ను ఆకట్టుకోవడంతో ఫోన్‌లో రికార్డు చేశాడు. ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేసినప్పటికీ.. అది వైరల్‌ అవ్వడానికి రెండేళ్లు పట్టింది. అటు ఇటు తిరిగి ఈ పాట ర్యాపర్‌ బాద్‌షా చేతికి చేరింది. ఇంకేం అతగాడు దాన్నీ రీమిక్స్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌ వదిలాడు. దీంతో ఆ వాయిస్‌ ఎవరిదా? అనే ఆరాలు ఎక్కువయ్యాయి. చివరికి మీడియా హౌజ్‌ల చొరవతో ఎట్టకేలకు చిన్నారి సహదేవ్‌ వెలుగులోకి వచ్చాడు.

ఫ్రెండ్సే చూపించారు  
సహదేవ్‌ తండ్రి పేద రైతు. ఉన్న కొద్ది భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. తల్లి కూలీ పనులకు వెళ్తుంటుంది. ఇక మనోడు గవర్నమెంట్‌ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇంతకీ ఈ పాట ఎలా బట్టీపట్టావ్‌ అని అడిగితే.. తన ఇంట్లో టీవీ లేదని, రోడ్డు మీద టీవీల్లో చూసి బట్టీపట్టానని అమాయకంగా చెప్తున్నాడు సహదేవ్‌. ఇక ఇప్పుడు ఇంటర్నెట్‌లో తన పాట వైరల్‌ అయ్యింది కూడా తన స్నేహితుడి తండ్రి మొబైల్‌లోనే చూశాడట. ఊరంతా తనని ‘సూపర్‌స్టార్‌’ అని పిలుస్తున్నారని మురిసిపోతున్నాడు సహదేవ్‌. ఈ చిన్నారి కుటుంబ ఆర్థికస్థితి తెలిసి చాలామంది దాతలు సాయానికి ముందుకు వస్తున్నారు. మరోవైపు ఈ సాంగ్‌ రీమిక్స్‌ కారకుడైన ర్యాపర్‌ బాద్‌షా.. ఈ కుర్రాడికి తనతో కలిసి ఆల్బమ్‌ చేసే ఛాన్స్‌ ఇచ్చాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top