సాధ్వి రితంబ‌ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

Sadhvi Ritambhara Controversial Comment In Uttar Pradesh - Sakshi

కాన్పూర్‌/లక్నో/సిమ్లా: భారత్‌ హిందూ దేశంగా మారాలంటే ప్రతి హిందూ దంపతులు నలుగురేసి పిల్లల్ని కనాలని సాధ్వి రితంబర కోరారు. వారిలో ఇద్దరిని దేశం కోసం కేటాయించాలన్నారు. కరడుగట్టిన హిందుత్వవాదిగా పేరున్న ఆమె శనివారం నిరాలానగర్‌లో రామ్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందూ దంపతులు నలుగురిని కని వారిలో ఇద్దరిని ఆర్‌ఎస్‌ఎస్‌కు దత్తతకివ్వాలి. వీహెచ్‌పీ కార్యకర్తలుగా తయారు చేసి దేశానికి అంకితం చేయాలి’’ అన్నారు. ‘‘జనాభా అసమతుల్యత భవిష్యత్తులో దేశానికి మంచిది కాదు. ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకొస్తే ఈ సమస్య ఉండదు’’ అని చెప్పారు. అయోధ్య రామ మందిర ఉద్యమంతో సంబంధమున్న రితంబర వీహెచ్‌పీ మహిళా విభాగం దుర్గావాహిని వ్యవస్థాపకురాలు.

నర్సింగానంద్‌.. మళ్లీ అదే మాట
భారత్‌ ముస్లిం దేశంగా మారకూడదంటే హిందువులు ఎక్కువ మంది సంతానాన్ని కనాలని యతి నర్సింగానంద్, అఖిలభారత సంత్‌ పరిషత్‌ హిమాచల్‌ప్రదేశ్‌ ఇన్‌చార్జి యతి సత్యదేవానంద్‌ సరస్వతి పిలుపునిచ్చారు. సోమవారం హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లా ముబారక్‌పూర్‌లో ‘ధర్మసంసద్‌’లో వారు మాట్లాడారు. ‘‘ముస్లింలు పథకం ప్రకారం ఎక్కువ మందిని కంటూ తమ జనాభాను పెంచుకుంటున్నారు. భారత్‌ ముస్లిం దేశంగా మారకుండా చూసేందుకు ఎక్కువ సంతానాన్ని కనాలని హిందూ దంపతులకు పిలుపునిస్తున్నాం’ అని సరస్వతి అన్నారు. ఇవి అభ్యంతరకర వ్యాఖ్యలంటూ జిల్లా పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. యతి నర్సింగానంద్‌ ఇటీవల మథురలోనూ ఇవే వ్యాఖ్యలు చేశారు. గతేడాది హరిద్వార్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన బెయిల్‌పై ఉన్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top