
బిహార్‌లో యంత్రాంగం నిర్వాకం
నరికేందుకు అనుమతించని అటవీ శాఖ
దాంతో అలాగే వదిలేసి రోడ్డేసిన అధికారులు
పట్నా: నల్లగా నిగనిగా మెరిసిపోతున్న సువిశాలమైన, నున్నని తారు రోడ్డు. చూద్దామన్నా ఎక్కడా ఒక్క గుంత కూడా లేదు. రెండువైపులా ఏపుగా పెరిగి కనువిందు చేస్తున్న చెట్లు. అలాంటి రోడ్డుపై యమా స్పీడుతో దూసుకుపోవాలని ఎవరికి మాత్రం ఉండదు! అలా వెళ్లే క్రమంలో ఆ చెట్లే ఉన్నట్టుండి రోడ్డు మధ్యలో ప్రత్యక్షమైతే? బిహార్‌లో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. పట్నాకు కేవలం 50 కి.మీ. దూరంలోని జెహానాబాద్‌లో రూ.100 కోట్ల వ్యయంతో ఓ రోడ్డును సువిశాలంగా విస్తరించారు. కానీ ఏడున్నర కి.మీ. పొడవైన ఆ రోడ్డు మధ్య ఒకచోట ఏపుగా పెరిగిన చెట్లను ఇదుగో, ఇలా వదిలేశారు.
ఇదేం అనాలోచితమైన పనంటారా? దీని వెనక ఓ ఆసక్తికరమైన కథ దాగుంది. ఈ చెట్లను తొలగిస్తామంటూ రోడ్డు నిర్మాణ సమయంలో జిల్లా యంత్రాంగం అటవీ శాఖను సంప్రదించింది. అందుకు శాఖ తొలుత అనుమతి నిరాకరించింది. పదేపదే కోరిన మీదట, ఏకంగా 14 హెక్టార్ల మేరకు అటవీ భూమికి సమానమైన పరిహారం కోరింది. అంత మొత్తం సమర్పించుకోవడం తమవల్ల కాదంటూ జిల్లా యంత్రాంగం చేతులెత్తేసింది. అలాగని ప్రాజెక్టును పక్కన పెట్టడానికి కూడా మనసు రాలేదు. దాంతో అటవీ నిబంధనలను ఉల్లంఘించకుండా చెట్లను ఇలా రోడ్ల మధ్యే వదిలేస్తూ పని పూర్తి చేసి చేతులు దులుపుకుంది.
ఇప్పుడు ఆ రోడ్డుపై ప్రయాణం జనానికి అక్షరాలా ప్రాణాంతకంగా మారింది. ఎందుకంటే ఆ చెట్లు రోడ్డుపై కనీసం ఒక వరుసలో కూడా కాకుండా ఇక్కడొకటి, అక్కడొకటి అన్నట్టుగా చెల్లాచెదురుగా ఉండిపోయాయి. వాటిగుండా పోవాలంటే వాహనాలను నానా వంపులూ తిప్పుతూ విచిత్రమైన ఫీట్లు చేయాల్సిందే.
ఆ క్రమంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కూడా. దాంతో చూస్తుండగానే ఇది మృత్యుమార్గంగా మారిపోయింది. నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా జిల్లా యంత్రాంగం ఇప్పటికీ ఈ చెట్ల బెడదను తప్పించే ప్రయత్నం కూడా చేయడం లేదు. మన దేశంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలేమికి ఇది మరో తిరుగులేని ఉదాహరణ అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు.