చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోగలవు | Trees Talk To Each Other Paper Birch And Douglasfir: An Odd Relationship | Sakshi
Sakshi News home page

చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోగలవు

Sep 13 2025 8:56 AM | Updated on Sep 13 2025 8:56 AM

Trees Talk To Each Other Paper Birch And Douglasfir: An Odd Relationship

ఈ ప్రకృతిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మనం మన మేధోశక్తితో శాస్త్ర సాంకేతికతను ఉపయోగించుకుని ఒక్కొక్క రహస్యాన్ని చేధిస్తూ వస్తున్నాం. ఉన్నచోటే ఉంటూ మనకు నిత్యం ఆక్సిజన్‌ అందిస్తున్న  చెట్లకు/మొక్కలకు ప్రాణం ఉందని జగదీష్‌ చంద్రబోస్‌ అనే శాస్త్రవేత్త శాస్త్రీయ ఆధారాలతో నిరూపించారు. మరి ప్రాణమున్న ప్రతీ జీవి శిలావిగ్రహంలా ఉండిపోదు కదా! ఇంకో ప్రాణితో కమ్యూనికేట్‌ చేస్తుంది. మనుషులకు భాష ఉన్నట్లు చెట్లకు కూడా వాటిదైన భాష ఉంటుందా అని సందేహం వచ్చింది మనిషికి. పరిశోధన చేశాడు.

అన్ని ప్రాణుల్లాగానే చెట్లు కూడా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని, అవి వాటి సామాజిక నెట్వర్క్‌లో భాగమని కెనడా శాస్త్రవేత్త సుజానే సిమార్డ్‌ తన పరిశోధనల ద్వారా నిర్థారించారు. చెట్లు ‘వుడ్‌ వైడ్‌ వెబ్‌’ అని పిలిచే భూగర్భ మైకోరైజల్‌ ఫంగస్‌ నెట్‌వర్క్‌ ద్వారా కమ్యూనికేట్‌ చేస్తాయట. పోషకాలు, నీరు వంటి వాటి గురించి వాకబు చేసుకోవడం, ఏదైనా ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించి హెచ్చరిక చేసుకోవడం వంటి చర్యల ద్వారా ఇవి కమ్యూనికేట్‌ అవుతాయి. ఈ నెట్‌వర్క్‌ చెట్ల రూట్‌ సిస్టమ్‌లను కలుపుతుంది, ఇది మానవ మెదడు న్యూరాన్‌ల వంటిది.

సిమార్డ్, 1997లో నేచర్‌ జర్నల్‌లో తన పరిశోధనను పబ్లిష్‌ చేస్తూ –– పేపర్‌ బిర్చ్, డగ్లస్‌ ఫిర్‌ చెట్ల మధ్య కార్బన్‌ బదిలీని రేడియోఆక్టివ్‌ ఐసోటోప్‌లతో ట్రాక్‌ చేసినట్టు చెప్పారు.  బిర్చ్‌ చెట్టు అధిక కార్బన్‌ను ఫిర్‌ చెట్టుకి పంపితే తరువాత ఫిర్‌ చెట్టు  బిర్చ్‌ చెట్టుకి కార్బన్‌ని పంపింది. ఇది చెట్ల పరస్పర సహకారాన్ని చూపిస్తుంది. 

మరో ఎక్స్‌పెరిమెంట్‌లో గాయపడిన డగ్లస్‌ ఫిర్‌ చెట్టు పొరుగు చెట్టయిన పాండెరోసా పైన్‌కు రక్షణ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయమని సిగ్నల్‌ పంపగా అది ప్రతిస్పందిచింది. ఇలాంటి అనేక పరిశోధనల తర్వాత ఇతర జీవుల్లానే చెట్లు కూడా సంభాషించుకుంటాయనే నిర్ధారణకు వచ్చారు శాస్త్రవేత్తలు. 

(చదవండి: 'ఊరంత స్కూలు': ఎర్లీ లెర్నింగ్‌ విలేజ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement