'ఊరంత స్కూలు': ఎర్లీ లెర్నింగ్‌ విలేజ్‌ | Early Learning Village Singapore | Sakshi
Sakshi News home page

'ఊరంత స్కూలు': ఎర్లీ లెర్నింగ్‌ విలేజ్‌

Sep 13 2025 8:44 AM | Updated on Sep 13 2025 9:28 AM

Early Learning Village Singapore

మీ స్కూల్లో మొత్తం ఎంతమంది చదువుతున్నారు? 500 మంది, వెయ్యి మంది.. అంతకంటే ఎక్కువుండటం కష్టం కదూ. అయితే ఒక ఊరంత స్కూల్‌ మీకు తెలుసా? అక్కడ  ఏకంగా 2,100 మంది స్టూడెంట్స్‌ ఉంటారు. ఇంకో విశేషమేమిటంటే, వీరంతా ప్రీ–స్కూల్‌ చదివే చిన్నారులు. సింగపూర్‌ నగరం లోరాంగ్‌ చువాన్‌లోని ఆస్ట్రేలియన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ (ఏఐఎస్‌) క్యాంపస్‌ పక్కనే ఈ స్కూల్‌ ఉంది. దీన్ని ‘ఎర్లీ లెర్నింగ్‌ విలేజ్‌ (Early Learning Village) అంటారు. 

ఏఐఎస్, స్టాంఫోర్డ్‌ అమెరికన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ కలిసి దీన్ని నిర్మించాయి. ప్రపంచంలో అతి పెద్ద ప్రీస్కూల్‌ ఇదే. సుమారు 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని కట్టించారు. అంటే మొత్తం ఏడు ఫుట్‌బాల్‌ మైదానాలంత స్థలంలో ఐదు భవనాలు, 100 కంటే ఎక్కువ తరగతి గదులతో ఈ స్కూల్‌ని నిర్మించారు. 18 నెలల నుండి ఆరు సంవత్సరాల వయస్సున్న పిల్లలు ఇక్కడ చదువుకుంటారు. వారికోసం ఈ క్యాంపస్‌ అంతా చెట్ల పచ్చదనంతో నిండి ఉంటుంది.  

2017లో ఈ స్కూల్‌ని ప్రారంభించారు. స్కూల్‌ అంటే కేవలం పుస్తకాలతో కుస్తీ పట్టడం, పద్యాలు పాడించడం మాత్రమే ఉండదు. ఇక్కడ పిల్లలు ఆడుకునేందుకు అనేక ఆట పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఈత నేర్పేందుకు సిబ్బందితోపాటు 20 మీటర్ల స్విమ్మింగ్‌ పూల్‌ ఉంది.  ఇక్కడ ఇండోర్‌ ఎయిర్‌ కండిషన్డ్‌డ జిమ్‌ కూడా ఉంది. ఇక్కడ వివిధ దేశాల చిన్నారులు చేరుతుండటంతో కొన్ని పాఠాలు వారి దేశాలు, ఖండాలకు తగ్గట్లుగా నేర్పిస్తారు. 

ఈ క్రమంలో ఒకే వయనున్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక అంతస్తు కేటాయించారు. ప్రతి తరగతి విద్యార్థులను నాలుగు బృందాలుగా విభజించి, వారు మరింత చురుగ్గా మారేందుకు టీచర్లు శ్రద్ధ చూపిస్తారు. ఈ స్కూల్‌ గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి తమ పిల్లల్ని ఇక్కడ చేర్పిస్తూ ఉంటారు. 

(చదవండి: నోరూరించే చాక్లెట్‌తో టేస్టీ..టేస్టీ రెసిపీలు..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement