
చెట్లను నిట్టనిలువుగా తగలబెడుతున్న పిడుగులు
కోట్ల సంఖ్యలో వృక్షాలను కోల్పోతున్న పుడమి
హరితవనాలకు ప్రాణసంకటంగా మారిన పిడుగులు
ఏటా 35,00,00,000 చెట్లు మెరుపులు, పిడుగులకు ఆహుతి
వాషింగ్టన్: వెచ్చని సూర్యకిరణాలు పుడమి తల్లిని ముద్దాడకుండా అడ్డుకుంటూ దట్టంగా, ఏపుగా పెరిగిన వృక్షాలను చూసి వరుణదేవునికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుదో లేదో తెలీదుగానీ వర్షం వంటి సందర్భాల్లో భూమిపైకి దూసుకొచ్చే మెరుపులు, పిడుగుల కారణంగా కోట్లాది వృక్షాలను కాలిబూడిద అవుతున్నాయి. పిడుగులు పడడంతో ఉద్భవించే అతి ఉష్ణానికి ప్రతి ఏటా అక్షరాలా 35 కోట్ల చెట్లు నిట్టనిలువునా కాలిపోతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది.
పుడమిపై పచ్చదనం క్షీణించడానికి పిడుగులు కూడా ప్రబల హేతువుగా మారాయన్న కొత్త విషయాన్ని అధ్యయనకారులు వెల్లడించారు. మ్యూనిచ్ టెక్నికల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ మేరకు విస్తృతస్థాయిలో పరిశోధన చేశారు. పిడుగులు పడటంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది చెట్లు కాలిపోతున్నాయని, దీంతో పచ్చదనం తగ్గిపోతోందని అధ్యయనంలో స్పష్టమైంది.
ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన అడవుల్లో వృక్షాల క్షీణతకు సంబంధించిన సమాచారాన్ని ఆధునిక గణన పద్ధతులతో విశ్లేషించి ఈ విషయాన్ని దృవీకరించుకున్నారు. అయితే వాస్తవంగా చూస్తే ఏటా ఇంతకంటే ఎక్కువ సంఖ్యలోనే వృక్షాలు పిడుగులకు బలికావొచ్చని అధ్యయనకారులు అంచనావేశారు. ‘‘ప్రతి సంవత్సరం పడుతున్న పిడుగుల కారణంగా ఎన్ని చెట్లు కాలిపోతున్నాయి అనేది అంశంతోపాటే ఏఏ దేశాల్లో పిడుగుల ఘటనలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి? వాటి కారణంగా తగ్గిన పచ్చదనంతో అక్కడ మారిన వాతావరణ పరిస్థితుల వివరాలనూ సేకరిస్తున్నాం’’అని అధ్యయనంలో ముఖ్య రచయిత ఆండ్రీస్ క్రాస్ చెప్పారు.
భారీ స్థాయిలో నష్టం
32 కోట్ల చెట్లు అంటే చిన్న విషయం కాదు. ఏకంగా ప్రపంచ వృక్ష సంపదలో 2.1 శాతం నుంచి 2.9 శాతానికి సరిపడా వృక్షాలు అంతరించిపోతున్నట్లే లెక్క. ఈ లెక్కన పుడమిపై పచ్చదనం గాఢత సైతం తగ్గుతోంది. ఇంతటి భారీ సంఖ్యలో చెట్లు లేకపోవడం కారణంగా ఈ చెట్లుఉంటే పీల్చుకునే కార్భన్‌డయాక్సైడ్ అలాగే వాతావరణంలోనే పోగుబడుతోంది. ఇలా ఏటా ఏకంగా 77 కోట్ల నుంచి 109 కోట్ల టన్నుల కార్భన్‌డయాక్సైడ్ వాతావరణంలోనే ఉండిపోతోంది.
ఇది భూతాపోన్నతికి ప్రత్యక్షంగా కారణమవుతోందని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తంచేశారు. పిడుగులు పరోక్షంగా 109 కోట్ల టన్నుల సీఓ2 వాతావరణంలో పేరుకుపోవడానికి కారణమైతే.. కార్చిచ్చు, అడవి దగ్ధం వంటి ఘటనల కారణంగా వృక్షసంపద కాలిపోయి తద్వారా దాదాపు అదే స్థాయిలో 126 కోట్ల టన్నుల కార్భన్‌డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల అవుతోంది.
మరింతగా పిడుగుల వర్షం!
రాబోయే రోజుల్లో పిడుగులు పడే దృగి్వషయాలు మరింతగా సర్వసాధారణం కానున్నాయని అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం ఉష్ణమండల అరణ్యాల్లో పిడుగులు ఎక్కువగా పడుతున్నాయి. దీంతో భారీసంఖ్యలో చెట్లు నాశనమవుతున్నాయి. రాబోయే రోజుల్లో సముద్రమట్టంతో పోలిస్తే మధ్యస్థాయి, కాస్తంత ఎక్కువ ఎత్తులో ఉండే దేశాల్లోనూ పిడుగుల బెడద ఎక్కువ కానుందని అధ్యయనకారులు చెప్పారు. సమశీతోష్ణ మండలాలు, యూరప్ దేశాల్లో పిడుగులు ఎక్కువగా పడే అవకాశముంది. దీంతో అటవీ ఆవరణ వ్యవస్థ, అక్కడి కార్భన్‌డయాక్సైడ్ స్థాయిలపై దుష్ప్రభావం పెరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు తమ పరిధిలోని అడవుల సంరక్షణపై మరింతగా దృష్టిసారించాలని అధ్యయనకారులు సూచించారు.