గాజాపై భీకర దాడికి నెతన్యాహూ ఆదేశం
బందీల మృతదేహాల అప్పగింత ఆలస్యమవుతుందన్న హమాస్
టెల్‌అవీవ్: గాజా ప్రాంతంపై భీకర దాడులు చేపట్టాలని సైన్యాన్ని ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మంగళవారం తెలపగా, అలాగైతే బందీల మృతదేహాల అప్పగింత ఆలస్యమవుతుందని హమాస్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 10న అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలు ప్రశ్నార్థకంగా మారింది. దక్షిణ గాజాలోని రఫాలో తమ బలగాలపై హమాస్ మంగళవారం కాల్పులు జరిపిందని ఇజ్రాయెల్ ఆరోపించింది.
అంతేకాకుండా, ఇప్పటికే స్వా«దీనం చేసుకున్న బందీ అవశేషాలను మళ్లీ అప్పగించిందంటూ హమాస్‌ను తప్పుబట్టింది. ఒప్పందాన్ని హమాస్ ఉల్లంఘించిందని స్పష్టమవుతోందని, బదులుగా గాజాపై భీకర దాడులు చేపట్టాలని ప్రధాని నెతన్యాహూ ఆదేశించారు. అయితే, నెతన్యాహూ హెచ్చరిక కారణంగా మంగళవారం దొరికిన మరో బందీ మృతదేహాన్ని అప్పగింత ఆలస్యమవుతుందని హమాస్ తెలిపింది. ఇప్పటికీ 13 మంది బందీల మృతదేహాలు హమాస్ వద్ద ఉన్నట్లు అంచనా.


