చైనాకు చుక్కలు చూపించిన మేజర్ షైతాన్ సింగ్ | 1962 Rezang La War Hero Major Shaitan Singh Bhati Bravery Story In Telugu - Sakshi
Sakshi News home page

Major Shaitan Singh Life Story: చైనాకు చుక్కలు చూపించిన మేజర్ షైతాన్ సింగ్

Published Sat, Nov 18 2023 12:17 PM

Rezang la war Hero Major Shaitan Singh Bravery Story - Sakshi

శత్రువు చేతికి చిక్కిన ఆ యోధుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయినా ధైర్యం కోల్పోలేదు. కాలితోనే శత్రువులపైకి తుపాకీ తూటాలు పేల్చాడు. శత్రువులను మట్టికరిపించి, భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. అనంతరం అమరుడయ్యాడు. చైనాకు చుక్కలు చూపించిన భారత అమరవీరుని కథ ఇది. 1962లో భారత్-చైనా మధ్య యుద్ధం జరిగింది. 

ఈ యుద్ధంలో భారతదేశం ఓడిపోయింది. అయితే 1962, నవంబరు 18న, అంటే యుద్ధం మధ్యలో మరొక చిన్న యుద్ధం జరిగింది. దీనిని రెజాంగ్ లా యుద్ధం అని చెబుతారు. ఈ యుద్ధంలో మేజర్ షైతాన్ సింగ్ విజయం సాధించి, అమరవీరుడు అయ్యాడు. మరణానంతరం పరమవీర చక్రను అందుకున్నాడు. 

1962లో భారత్‌పై చైనా దాడి చేసింది. ఈ సమయంలో కుమావోన్ రెజిమెంట్‌కు చెందిన 13వ బెటాలియన్ లేహ్-లడఖ్‌లోని చుషుల్ సెక్టార్‌లో మోహరించింది. దీనిలోని సీ కంపెనీ సముద్ర మట్టానికి 5 వేల మీటర్ల (16 వేల అడుగులు) ఎత్తులో రెజాంగ్ లా వద్ద ఉన్న పోస్ట్‌లో పెట్రోలింగ్‌ ని​ర్వహిస్తోంది. 1962 నవంబరు 18న ఉదయం చైనా దళాలు ఈ పోస్ట్‌పై దాడి చేశాయి. తేలికపాటి మెషిన్ గన్‌లు, రైఫిల్స్, మోర్టార్లు, గ్రెనేడ్‌లతో దాడి జరిగింది. ఆ సమయంలో ఎముకలు కొరికే చలి సైనికులను చుట్టుముట్టింది 

దాదాపు 1300 మంది చైనా సైనికులతో 120 మంది భారత సైనికులు పోరాడుతున్నారు. మేజర్ షైతాన్ సింగ్.. రెజిమెంట్‌లోని చార్లీ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. ఈ యుద్ధంలో పోరాడేందుకు తక్కువ సైనిక బలగం, తక్కువ ఆయుధాలు ఉన్నాయని గ్రహించిన ఆయన ఒక వ్యూహాన్ని రూపొందించారు. సైనికులు ఫైరింగ్ పరిధిలోకి రాగానే శత్రువుపై కాల్పులు జరపాలని ఆదేశించారు. ఒక్క బుల్లెట్‌తో ఒక్కో చైనా సైనికుడిని చంపేయాలని కోరాడు. 

ఈ వ్యూహంతో భారత సైనికులు దాదాపు 18 గంటల పాటు శత్రువులను ఎదుర్కొని విజయం సాధించారు. అయితే అప్పటికే 114 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కుయుక్తులకు దిగి, దాడి చేయడంతో ఈ యుద్ధంలో గెలిచింది. భారత సైన్యానికి చెందిన మూడు బంకర్లు ధ్వంసం అయ్యాయి. 

తీవ్రంగా గాయపడిన మేజర్ షైతాన్ సింగ్  శత్రువులతో పోరాడుతూనే ఉన్నాడు. కాలికి మెషిన్ గన్ కట్టుకుని, కాలి వేళ్లతో ట్రిగ్గర్ నొక్కుతూ బుల్లెట్లు కురిపించాడు. అయితే మేజర్ షైతాన్ సింగ్‌కు అధిక రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించింది. సుబేదార్ రామచంద్ర యాదవ్ అతనిని తన వీపునకు కట్టుకుని చాలా దూరం వరకూ తీసుకెళ్లి, అక్కడ పడుకోబెట్టారు. కొద్దిసేపటికే మేజర్ షైతాన్ సింగ్‌ అమరుడయ్యాడు. ఈ ఘటన 1962 నవంబరు 18 జరిగింది.
ఇది కూడా చదవండి: ఉత్తరాదిన పొగమంచు.. దక్షిణాదిన భారీ వర్షాలు!
 

Advertisement
Advertisement