అరేబియన్‌ సముద్ర జలాల్లో 3,300 కేజీల డ్రగ్స్‌ స్వాధీనం

Record 3300 kg narcotics seized from boat off Gujarat coast - Sakshi

పోలీసుల అదుపులో ఐదుగురు

సాక్షి, విశాఖపట్నం: అరేబియా సముద్ర జలాల్లో భారీ మొత్తంలో మత్తుపదార్థాలను భారత నౌకాదళం స్వా«దీనం చేసుకుంది. సముద్రజలాలపై ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్‌ను స్వా«దీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. ఇరాన్‌లోని ఛబహర్‌ నౌకాశ్రయం నుంచి బయల్దేరి మంగళవారం ఉదయం అరేబియా సముద్రంలో అంతర్జాతీయ సముద్రజలాల సరిహద్దు(ఐఎంబీఎల్‌)కు 60 నాటికల్‌ మైళ్ల దూరంలో భారత్‌ వైపు వస్తున్న ఒక అనుమానిత చేపల పడవను భారత నావికాదళ నిఘా విమానం కనిపెట్టి వెంటనే ప్రధాన కార్యాలయానికి సమాచారం చేరవేసింది.

అక్కడి నుంచి నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ)కి సమాచారం అందింది. వెంటనే నేవీ, ఎన్‌సీబీ, గుజరాత్‌ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. పీ8ఐ నేవీ విమానం, యుద్ధనౌక, హెలికాప్టర్లు ఆ పడవను చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. నౌకను ఎన్‌సీబీ అధికారులు తనికీచేయగా దాదాపు 3,300 కేజీల మాదకద్రవ్యాలున్న ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ ప్యాకెట్లలో 3,110 కేజీల ఛరస్‌/హషి‹Ù, 158.3 కేజీల స్ఫటికరూప మెథామ్‌ఫెటమైన్, 24.6 కేజీల హెరాయిన్‌ ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో వీటి మొత్తం విలువ గరిష్టంగా రూ.2,000 ఉండొచ్చని ఢిల్లీలో ఎన్‌సీబీఐ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ అంచనావేశారు. ఆ ప్యాకెట్ల మీద ‘రాస్‌ అవద్‌ గూడ్స్‌ కంపెనీ, పాకిస్తాన్‌ తయారీ’ అని రాసి ఉంది. మత్తుపదార్థాల ప్యాకెట్లతోపాటు పడవలో ఉన్న ఐదుగురు విదేశీయులను అరెస్ట్‌చేశారు. వీరి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. వీరిని పాక్‌ లేదా ఇరాన్‌ దేశస్తులుగా భావిస్తున్నారు. వీరి నుంచి ఒక శాటిటైల్‌ ఫోన్, నాలుగు స్మార్ట్‌ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. ‘భారత నావికాదళం, ఎన్‌సీబీ, గుజరాత్‌ పోలీసులు సాధించిన ఈ విజయం మత్తుపదార్థాల రహిత భారత్‌ కోసం కేంద్రం చేస్తున్న కృషికి నిదర్శనం’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. సముద్ర జలాల్లో ఇన్ని కేజీల డ్రగ్స్‌ పట్టివేత ఇదే తొలిసారి. అంతకుముందు 2023 మేలో కేరళ తీరంలో 2,500 కేజీల మత్తుపదార్థాలను ఎన్‌సీబీ, నేవీ          పట్టుకున్నాయి. 

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top