Rajya Sabha YSRCP MP Vijayasai Reddy Questions Union Minister Answers, Details Inside - Sakshi
Sakshi News home page

విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ.. రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

Published Wed, Dec 7 2022 5:21 PM

Rajya Sabha YSRCP MP Vijayasai Reddy Questions Union Minister Answers - Sakshi

న్యూఢిల్లీ: మహిళలకు నైపుణ్య శిక్షణ కోసం దేశంలో ప్రత్యేకంగా 19 జాతీయ మహిళా నైపుణ్య శిక్షణా సంస్థలు (ఎన్ఎస్టీఐ) పనిచేస్తున్నట్లు స్కిల్ డెవలప్‌మెంట్‌ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా 33 ఎన్‌ఎస్‌టీఐలు వాటికి అనుబంధంగా మూడు కేంద్రాలు నెలకొల్పినట్లు తెలిపారు.

ఇందులో 19 ఎన్‌ఎస్టీఐలు ప్రత్యేకంగా మహిళల కోసం నెలకొల్పినవే. విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్‌ (హైదరాబాద్‌)లో మూడు ఎన్‌ఎస్‌టీఐలు నెలకొల్పగా అందులో ఒకటి మహిళల కోసం ప్రత్యేకించిందని మంత్రి చెప్పారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌ఎస్‌టీఐ నెలకొల్పలేదని చెబుతూ విశాఖపట్నం గాజువాకలోని క్రాఫ్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ట్రైనింగ్‌ ట్రైనర్స్‌ (సీఐటీఎస్‌)ను అనుబంధ సంస్థగా ప్రకటించి 2022-23 నుంచి ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, వెల్డర్‌ వంటి ట్రేడ్లలో శిక్షణను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఈ మూడు ట్రేడ్లలో 75 మందికి శిక్షణ పొందే అవకాశం ఉన్నట్లు మంత్రి తెలిపారు.

చెంచులకు వేతనంతో కూడిన ఉపాధి కొనసాగుతుంది
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని నల్లమల్ల అడవుల్లో నివసించే చెంచు తెగకు చెందిన ప్రజలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతనంతో కూడిన ఉపాధి కల్పించేందుకు క్రియాశీలకమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు తెలిపాయని రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి రాతపూర్వకంగా తెలిపారు.

గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్గదర్శకాలలో చేసిన మార్పుల కారణంగా నల్లమల అడవులలో జీవించే చెంచు తెగకు చెందిన ప్రజలు ఈ పథకం కింద వేతనంతో కూడిన ఉపాధి పొందడానికి అనర్హులవుతారా అన్న ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ మార్గదర్శకాలను సవరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి విజ్ఞప్తి రాలేదని చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement