న్యూఢిల్లీ: చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో కొంత ఊరట లభించింది. తన బకాయిల్లో భాగంగా రూ.1.15 కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్‌తో బుధవారం కోర్టుకు హాజరైన ఆయన.. మిగిలిన రూ.8.5 లక్షలను చెల్లించేందుకు అక్టోబర్ 13 వరకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ రాజ్‌పాల్ యాదవ్ భావోద్వేగానికి గురయ్యారు. ఈయన తెలుగులో ‘కిక్ 2’లో ‘దున్న’ పాత్రలో నటించారు.
తాను దర్శకత్వం వహించిన ‘అతా పతా లాపతా’ కారణంగా భారీగా నష్టపోయానని రాజ్‌పాల్ యాదవ్ కోర్టుకు తెలిపారు. ఆ సినిమా వల్ల తనకు రూ.17 కోట్ల నష్టం వచ్చిందని, గత 13 ఏళ్లుగా సినిమా విడుదలకు సంబంధించిన వివాదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. రూ.5 కోట్ల వివాదం కారణంగా తనకు సుమారు రూ.22 కోట్ల నష్టం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. తాను ఎన్నో ఏళ్లుగా ప్రజలను అలరిస్తూ వచ్చానని, కానీ ఇప్పుడు తన జీవితమే ఒక నాటకంగా మారిపోయిందని రాజ్‌పాల్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను దాదాపు 200 సినిమాల్లో నటించానని, తన జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయని, రుణాన్ని తిరిగి చెల్లిస్తానని కోర్టుకు హామీ ఇచ్చారు.
విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రాజ్‌పాల్ యాదవ్ పరిస్థితిపై స్పందించింది. సినిమాలు తీయడం, వాటితో వచ్చే పరిణామాల గురించి కోర్టులో చర్చ జరిగింది. ప్రజలను అలరించే మంచి సినిమాలు చేయాలని సీజేఐ సూచించించారు. సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం రాజ్‌పాల్ యాదవ్‌కు రెండు వారాల గడువు ఇచ్చింది. ఈ వ్యవధిలో బకాయి మొత్తాన్ని చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ నిధులు సమకూర్చకపోవడంపై గత విచారణలో ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ వ్యవహారం మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులతో ముడిపడి ఉంది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు రాజ్‌పాల్ యాదవ్‌ను దోషిగా నిర్ధారించి, ప్రతీ నేరానికి మూడు నెలల జైలు శిక్ష విధించింది. అయితే ఆయన శిక్షను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదుదారుకు కొంత మొత్తమైనా తిరిగి అందేలా చూడటానికే తాము ఆయనకు అవకాశమిస్తున్నామని సీజేఐ గత విచారణలో పేర్కొన్నారు. గతంలో రూ.2 కోట్లు జమ చేయడానికి ఒక రోజు గడువు ఇచ్చిన కోర్టు, అదే చివరి అవకాశమని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ‘సర్’ సేవలో అధ్యాపకులు.. క్లాసుల్లేకుండా ‘సెమిస్టర్లా?


