‘సర్‌’ సేవలో అధ్యాపకులు.. క్లాసుల్లేకుండా ‘సెమిస్టర్లా? | Karnataka Colleges Struggle as Faculty Are Deployed for SIR Duty | Sakshi
Sakshi News home page

‘సర్‌’ సేవలో అధ్యాపకులు.. క్లాసుల్లేకుండా ‘సెమిస్టర్లా?

Oct 7 2026 12:43 PM | Updated on Oct 7 2026 12:48 PM

Karnataka Colleges Struggle as Faculty Are Deployed for SIR Duty

‘సర్‌’ కారణంగా కర్ణాటకలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థుల చదువులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌) కార్యక్రమం కోసం పలువురు అధ్యాపకులను అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులుగా నియమించడంతో చాలా కాలేజీల్లో తరగతులు సక్రమంగా జరగడం లేదు. అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ సెమిస్టర్లు ముగింపు దశకు చేరుకున్నప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు.

బెంగళూరు నార్త్ యూనివర్సిటీ (బీఎన్‌యూ) పరిధిలోని కాలేజీల్లో ప్రస్తుత విద్యా సంవత్సరం జూలై 20న ప్రారంభమైంది. అయితే సర్‌ విధులకు పంపిన చాలా మంది అధ్యాపకులు ఇప్పటికీ తిరిగి రాలేదని కాలేజీల ప్రిన్సిపాళ్లు చెబుతున్నారు. తమ సమస్యను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఓ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా కాలేజీ సిబ్బందిలో 50 శాతానికి పైగా సర్‌ పనికి వెళ్లారు. దీంతో మొత్తం విద్యా వ్యవస్థ దెబ్బతింది’ అని బీఎన్‌యూ పరిధిలోని ఓ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు. మరో కాలేజీ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. తమ క్యాంపస్‌లో 3,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని, అధ్యాపకులు అందుబాటులో లేకపోవడంతో చాలామంది విద్యార్థులు తరగతులకు హాజరుకావడం లేదన్నారు.

అధ్యాపకుల కొరతను అధిగమించేందుకు గెస్ట్ ఫ్యాకల్టీలతో తరగతులు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే వారు కూడా ఇటీవలే విధుల్లో చేరారని, కామర్స్, సైన్స్, ఇంగ్లిష్ వంటి కొన్ని విభాగాలకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు అవసరమని ఓ ప్రిన్సిపాల్ చెప్పారు. బీఎన్‌యూ పరిధిలో ప్రస్తుత సెమిస్టర్‌కు నవంబర్ 7 చివరి పనిదినం కాగా, డాక్టర్ మన్మోహన్ సింగ్ బెంగళూరు సిటీ యూనివర్సిటీ పరిధిలో అక్టోబర్ 23 చివరి పనిదినంగా ఉంది.

కొన్ని కాలేజీల్లో మొత్తం సిబ్బందినీ సర్‌ విధులకు పంపినట్లు ప్రిన్సిపాళ్లు తెలిపారు. తమ కాలేజీలో స్పోర్ట్స్ ట్రైనర్, లైబ్రేరియన్లను కూడా ఈ పని నుంచి మినహాయించలేదని ఓ ప్రిన్సిపాల్ చెప్పారు. ప్రతిరోజూ విద్యార్థులకు సమాధానం చెప్పాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యాపకులను ఎప్పుడు సర్‌ విధుల నుంచి రిలీవ్ చేస్తారని అధికారులను అడిగితే.. కాలేజీని మూసివేయాలని చెప్పారని మరో ప్రిన్సిపాల్ తెలిపారు.

కర్ణాటక ప్రభుత్వ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టిఎం మంజునాథ్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, అధ్యాపకులను సర్‌ విధుల నుంచి రిలీవ్ చేయాలని కోరారు. తరగతులు నిర్వహించకుండానే సెమిస్టర్ పూర్తి చేయడం విద్యార్థులకు తీవ్ర అన్యాయమని అన్నారు. కొన్ని జిల్లాల్లో కాలేజీల మొత్తం సిబ్బందినీ సర్‌ పనికి పంపారని, దీనివల్ల విద్యా నాణ్యత దెబ్బతింటుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరేందుకు కూడా ఆసక్తి చూపకపోవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇదీచదవండి: kolkata: దుర్గాపూజలో వినూత్న థీమ్‌లు.. చూసి తీరాల్సిందే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement