ప్రారంభించిన రాహుల్ గాంధీ
దేశవ్యాప్త ఉద్యమాల నమోదుకు పిలుపు
న్యూఢిల్లీ: దేశంలో సత్యాన్ని అణచివేసే ప్రయత్నాలు సాగుతున్నాయని, వీటిని అడ్డుకోవడం ప్రతిపక్ష నేతగా తన బాధ్యతని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా వేర్వేరు అంశాలపై వెల్లువెత్తుతున్న నిరసన గళాలు అన్నింటినీ ఒక్క చోటికి తీసుకొచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘సత్యాగ్రహ’డిజిటల్ వేదికను రాహుల్ శనివారం ప్రారంభించారు.
మహాత్మా గాంధీ 157వ జయంతి మరుసటి రోజున ప్రారంభమైన ఈ వేదికలో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలు తమ ఉద్యమ వివరాలను నమోదు చేసుకోవాలని రాహుల్ పిలుపునిచ్చారు. ఈ వివరాలను ఇంటరాక్టివ్ మ్యాప్‌లో కనిపించేలా చేసి, ఒకే తరహా సమస్యలపై పోరాడుతున్న వారిని అనుసంధానించడం, సత్యం అణచివేతకు గురవుతున్న ప్రతిచోటా అండగా నిలవడమే ఈ వేదిక ఉద్దేశమని తెలిపారు.
‘‘దేశవ్యాప్తంగా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. అయితే, చాలాసార్లు ఇవి ఒంటరి పోరాటాలుగానే మిగిలిపోతున్నాయి. జెన్–జీ, యువత, విద్యార్థులు, రైతులు, ఆదివాసీలు, దళితులు, మహిళలు ఒక్కో పోరాటానిది ఒక్కో ప్రత్యేక కథ. అయితే ఒంటరి గొంతుకలను అణచివేయడం సులభం’’అని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే గొంతులన్నింటినీ ఒకే మ్యాప్‌పైకి తీసుకు వచ్చేందుకు ‘సత్యాగ్రహ’ఏర్పాటైందని చెప్పారు. మహాత్మాగాంధీ సత్యమే గొప్ప ఆయుధమని బోధించారని, అయితే ఇందుకోసం కలిసికట్టుగా నిలబడితే ఆయుధం మరింత శక్తిమంతమవుతుందని అన్నారు.


