జ్ఞానేశ్‌ రాజీనామా చేసేదాకా తగ్గేదే లేదు  | Rahul Gandhi demonds demands CEC Gyanesh Kumar resignation | Sakshi
Sakshi News home page

జ్ఞానేశ్‌ రాజీనామా చేసేదాకా తగ్గేదే లేదు 

Oct 13 2026 6:11 AM | Updated on Oct 13 2026 6:11 AM

Rahul Gandhi demonds demands CEC Gyanesh Kumar resignation

స్పష్టంచేసిన రాహుల్‌ గాంధీ 

సీఈసీ వెంటనే పదవిని వీడి అప్రూవర్‌గా మారాలి 

30 వేల మంది పోలీసులతో ఢిల్లీని ఎందుకు జైలుగా మార్చారని ప్రశ్న

ఈవీఎంల అవకతవకలపై తేలేవరకు పోరాటం ఆగదని స్పష్టీకరణ

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ రాజీనామా చేసేంతవరకు విపక్షాలు, ప్రజలు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. జ్ఞానేశ్‌ పదవికి రాజీనామా చేసి ఎన్నికల వ్యవస్థలో జరిగిన అక్రమాలపై అప్రూవర్‌గా మారాలని సూచించారు. అలా చేస్తే దేశానికి మేలు చేసినవారవుతారని, ప్రజలు క్షమించే అవకాశం ఉంటుందని చెప్పా. 

’దిల్లీ చలో’పాదయాత్ర నేపథ్యంలో సోమవారం ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో రాహుల్‌ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘మోదీ సర్కారు జ్ఞానేశ్‌ను కాపాడేందుకే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వస్తున్న ప్రజలను అడ్డుకునేందుకు 30 వేల మందికి పైగా పోలీసులతో ఢిల్లీని ఎందుకు నిర్బంధించారు? దేశ రాజధానిని జైలుగా ఎందుకు మార్చారు?’’అని సూటిగా ప్రశ్నించారు. శాంతియుత నిరసనలకు బయల్దేరిన యువత, పౌరులను రైళ్లు, బస్సుల్లోంచి బలవంతంగా కిందకు దింపేస్తున్నారని రాహుల్‌ మండిపడ్డారు. 

దేశ రాజధానిని ఒక సైనిక స్థావరంలా మార్చారని ధ్వజమెత్తారు. ‘భారీ బందోబస్తు పెట్టినంత మాత్రాన వెనకడుగు వేయబోం. ప్రభుత్వం ఎంత మంది పోలీసులను మారిస్తే అంత మంచిది. మోదీ ప్రభుత్వం జ్ఞానేశ్‌ను ఏస్థాయిలో కాపాడుతోందో దేశప్రజలంతా చూసి తెల్సుకోవాలి. కేంద్రం చేస్తున్న ఈ పెద్ద తప్పును యావత్‌ భారతదేశం గమనిస్తోంది’అని రాహుల్‌ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా సాగుతున్న ప్రజా ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతోందని వెల్లడించారు. 

200 మంది అధికారులతో సంప్రదింపులు
‘‘ప్రభుత్వ వ్యవస్థలలో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగులు, పోలీసులు యువతపై బలప్రయోగం చేయడానికి సిద్ధంగా లేరు. హింసను ప్రేరేపించే ఆరెస్సెస్, బీజేపీ వర్గాలను స్వేచ్ఛగా తిరగనిస్తూ, ప్రశ్నించే యువతను ఆపడంపై భద్రతా బలగాల్లోనూ అసంతప్తి వ్యక్తమవుతోంది. ఈడీ, సీబీఐ, విదేశాంగ శాఖ ఇలా పలు ప్రభుత్వ విభాగాల్లోని కీలకమైన 200 మందికి పైగా అధికారులు లోపల జరుగుతున్న సమాచారాన్ని విపక్షనేతలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. దేశంలోని కోట్ల మంది యువత రాజ్యాంగాన్ని తమ మతంగా భావిస్తున్నారు. ఆ గొంతును నొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది’’అని ఆరోపించారు. 

సమాంతర ఉద్యమాలు లేవు.. 
‘‘జ్ఞానేశ్‌ రాజీనామా డిమాండ్‌తో దేశంలో జరుగుతున్నది ఒక్కటే ఉద్యమం. సమాంతర ఉద్యమాలే లేనేలేవు. కాక్రోచ్‌ జనతా పార్టీ, విద్యార్థి, సామాజిక సంఘాలు చేపడుతున్న ఉద్యమాలన్నీ విపక్షాల ‘ఇండియా’కూటమి ప్రధాన ఉద్యమంలో భాగాలే. రాజ్యాంగం పరిరక్షించబడి, సీఈసీ పదవి నుంచి జ్ఞానేశ్‌ తప్పుకుని, ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన చెంది, న్యాయం జరిగేదాకా విద్యార్థి, యువత ఉద్యమం ఆగబోదు’’అని రాహుల్‌ స్పష్టంచేశారు. 

జ్ఞానేశ్‌ నుంచీ మెసేజ్‌లు వస్తున్నాయి.. 
‘‘జ్ఞానేశ్‌ నుంచి సైతం మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. మన పత్రికాసమావేశాన్ని ఆయన సైతం ప్రత్యక్షప్రసారంలో చూస్తూనే ఉండిఉంటారు. ఇకనైనా ఆయన అప్రూవర్‌గా మారితే మంచిది. మీరు అతిపెద్ద నేరం చేశారు. నిజం చెప్పాలంటే నేరం చేసిన మీ వెనకాల అసలైన నేరగాళ్లు దాక్కున్నారు. మీరూ తప్పుచేశారుగానీ ఆ తప్పుకు అసలైన కారకులు మీరు కాదు. మీ వెనకాల ఉన్న వాళ్లు. మీ వెనుక ఉండి నడిపిస్తున్న అసలు వ్యక్తుల వద్దకు చేరుకుంటాం. సీఈసీగా మీరు కొనసాగలేరు. మీపై ఉన్న ఒత్తిడిని అర్థం చేసుకోగలం. మేం క్రూరులం కాదు, క్షమించే గుణం ఉన్నవాళ్లం. రాజ్యాంగాన్ని కాపాడటమే మా ఏకైక లక్ష్యం’’అని రాహుల్‌ అన్నారు. 

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై అంత ప్రేమ ఎందుకు?
‘‘జంతర్‌మంతర్, పరిసర ప్రాంతాల్లో ఉద్యమిస్తున్న విద్యార్థులు, విపక్షపార్టీల కార్యకర్తలపై పోలీసుల జులుం కొనసాగుతోంది. కానీ అదే ప్రాంతంలో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న బీజేపీ కార్యకర్తలు, ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులను పోలీసులు కన్నెత్తి్తచూడట్లేరు. వాళ్లపై అంతటి ప్రేమ ఎందుకు? ’’అని రాహుల్‌ నిలదీశారు. 

రాష్ట్రపతికి ఆధారాలు సమర్పిస్తాం.. 
రాష్ట్రపతి ముర్ముతో జరిగిన భేటీపై రాహుల్‌ ప్రస్తావించారు. ‘‘ఎన్నికల అక్రమాలపై రాష్ట్రపతి ఆధారాలు కోరారు. దీంతో పూర్తి స్థాయి పత్రాలను సిద్ధం చేసి సమర్పిస్తామని తెలిపాం.రాష్ట్రపతి భవన్‌ నుంచి ఎలాంటి తిరస్కరణ రాలేదు. దేశం కోసం చేసే ఈ పోరాటం ఒక్క రోజులోనో, రెండు రోజుల్లోనో ముగిసేది కాదు. నెలలు, సంవత్సరాలు పట్టినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. రోడ్లపైనే కాదు, ప్రజల ఆలోచనల్లో ప్రజాస్వామ్య రక్షణ స్పృహను రగిలించడమే మా లక్ష్యం. ఈ పోరాటంలో అలుపు లేకుండా నిలబడతాం’’ అని రాహుల్‌ స్పష్టం చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement