రాష్ట్ర ఆవిర్భావం కోసం కృషిచేసిన పౌరులను ప్రభుత్వం పట్టించుకోట్లేదు
ఉత్తరాఖండ్ అంశంలో మోదీ సర్కార్‌పై రాహుల్‌గాంధీ విమర్శలు
డెహ్రాడూన్: రాష్ట్ర ఆవిర్భావం కోసం ఉత్తరాఖండ్ ప్రజలు చేసిన త్యాగాలను, పడిన కష్టాలకు మోదీ సర్కార్ పూచికపుల్ల అంత విలువ కూడా ఇవ్వట్లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ఉత్తరాఖండ్‌లో పాలనను మోదీ ప్రభుత్వం రిమోట్ కంట్రోల్ మాదిరి పరిపాలిస్తోందని రాహుల్ ధ్వజమెత్తారు.
శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాహుల్ ఆల్మోరా, పౌడీ గడ్వాల్‌లో పర్యటించాలని భావించారు. అయితే ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని పంత్‌నగర్ ఎయిర్‌పోర్ట్ నుంచి రాహుల్‌తో బయల్దేరిన హెలికాప్టర్ భారీ వర్షం, అననుకూల వాతావరణంతో తిరిగి ఎయిర్‌పోర్ట్‌కే చేరుకుంది. దీంతో రాహుల్ రెండు ర్యాలీల్లో వర్చువల్‌గా ప్రసంగించారు.
‘‘ఎంతో చారిత్రక అవసరంతో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్ర సాధన కోసం ఇక్కడి ప్రజలు ఎంతో కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలుచేశారు. మీరు సాధించిన ఈ రాష్ట్రాన్ని మీరు కాకుండా వేరే వాళ్లు(మోదీ) రిమోట్ కంట్రోల్ పాలిస్తుండటం దురదృష్టకరం. స్థానికుల ప్రయోజనాలను పక్కనబెట్టి రాష్ట్రేతరులు ఇక్కడి సహజ సంపదను కొల్లగొడుతున్నారు’’ అని అన్నారు. కేంద్రం అమలుచేస్తున్న అగ్నిపథ్ పథకంపై రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పౌడీ గడ్వాల్‌లో మాజీ సైనికుల ర్యాలీలో రాహుల్ వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ జవాన్లతో భారత్‌కు శాశ్వత పవిత్రబంధం ఉండేది.
యువత జవాన్లుగా శాశ్వతంగా దేశసేవలో నిమగ్నమయ్యేవారు. దేశం కోసం సరిహద్దుల పరిరక్షణ కోసం జవాన్లు తమ రక్తాన్ని ధారపోస్తారు. అవసరమైతే ప్రాణాలను అర్పిస్తారు. అలాంటి వాళ్లకు, వాళ్ల కుటుంబాలకు భారతసర్కార్ భరోసా ఇస్తుంది. ఇలాంటి జవాన్లతో ఉండే పవిత్రబంధాన్ని ‘అగ్నిపథ్’ పథకం తెచ్చి ప్రధాని మోదీ సర్కార్ తుంచేసింది. యువతను త్రివిధ దళాల్లోకి అగ్నివీర్‌లుగా తాత్కాలిక ప్రాతిపదికన తీసుకుంటూ 2022లో అగ్నిపథ్ పథకం తెచ్చారు. మేం కేంద్రంలో అధికారంలోకి రాగానే ఈ అసంబద్ధ అగ్నిపథ్ పథకాన్ని రద్దుచేస్తాం’’ అని రాహుల్ చెప్పారు.


